Advanced Technology Centres in Telangana: తెలంగాణలోని ప్రభుత్వ ఐటీఐలకు మహర్దశ పట్టనుంది. కాలానుగుణంగా ప్రస్తుత ఉద్యోగావసరాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ(ITI)లను ఆధునిక నైపుణ్య కేంద్రాలుగా (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ - ATC) తీర్చిదిద్దాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాల ఆధునికీకరణ ప్రాజెక్టును రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా ఐటీఐలలో కొత్త ట్రేడ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని మొత్తం 65 ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం మొదట భావించింది. అయితే.. తొలి దశలో 25 అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. జిల్లాల్లోని కొన్ని కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, స్థలాభావం సమస్యలు ఉండటం, మరికొన్ని అద్దె భవనాల్లో ఉండటం తదితర పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాదికి 25 ఐటీఐలను ఏటీసీలుగా మార్చాలని, వచ్చే ఏడాదికి మరో 25 కళాశాలల్లో ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో హైదరాబాద్‌లో అత్యధికంగా ఐదు ఏటీసీలు అందుబాటులోకి రానున్నాయి. 


టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం.. 
రాష్ట్రంలో ఏటా లక్ష మందికి నైపుణ్య శిక్షణ అందించాలనే లక్ష్యంతో దాదాపు రూ.2,700 కోట్ల ఖర్చుతో నైపుణ్య శిక్షణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పలు కోర్సులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మానవ వనరులు, తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం 'టాటా టెక్నాలజీస్'తో ఇటీవల ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ప్రకారం కేంద్రాల ఆధునికీకరణ పనులు మొదలుపెట్టారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మల్లేపల్లి ఐటీఐలో శంకుస్థాపన చేసిన ఏటీసీ (ATC) కేంద్రం మూడు నెలల్లోనే అందుబాటులోకి వచ్చేలా వేగంగా పనులు జరుగుతున్నాయి. 


ఉపాధికి గ్యారంటీ...
టాటా టెక్నాలజీస్ ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ఐటీఐలను 'ఏటీసీ'లుగా తీర్చిదిద్దుతోంది. అక్కడి ప్రభుత్వాల సహకారంతో దిగ్విజయంగా కొనసాగిస్తోంది. టాటా సంస్థ 'పరిశ్రమ 4.0' పేరుతో దీర్ఘకాల, స్వల్వ వ్యవధి కోర్సులతోపాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల కోసం బ్రిడ్జి కోర్సులనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రొడక్ట్ డిజైన్ డెవలప్‌మెంట్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐవోటీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ప్రొడక్ట్ డిజైన్ డెవలప్‌మెంట్, ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, మోడ్రన్ ఆటోమేటివ్ మెయింటెనెన్స్, ప్రొటోటైపింగ్ ఇండస్ట్రియల్ రోబోటిక్స్ ఆర్క్ వెల్డింగ్, ఏఐ ఆధారిత వర్చువల్ వెల్డింగ్-పెయింటింగ్ తదితర కోర్సులు ఉన్నాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(NCVT) గుర్తింపు ఉన్న ఆయా కోర్సులను పూర్తిచేసే వారికి ప్రముఖ కంపెనీల్లో ఉపాధికి ఢోకా ఉండదని సర్కారు భావిస్తోంది. 


ఔట్‌సోర్సింగ్ విధానంలో సిబ్బంది నియామకం...
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే 'ఆధునిక నైపుణ్య కేంద్రాల్లో' కొత్త కోర్సుల బోధనకు సంబంధించి ఒక్కో కేంద్రానికి అదనంగా దాదాపు 12 నుంచి 15 వరకు ఫ్యాకల్టీలు అవసరం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలలో బోధకుల పోస్టుల్లో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కోర్సుల బోధనకు సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించుకోవాలని ఉపాధి కల్పన శాఖ భావిస్తోంది. అందుకు అనుగుణమైన విద్యార్హతలు కలిగిన వారిని ఎంపికచేసే బాధ్యతను టాటా సంస్థకే అప్పగించే అవకాశం ఉంది.




మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..