Anantapur Crime News :  విద్యుత్ బిల్లుల బకాయిల కోసం వెళ్తున్న సిబ్బందిపై దాడులు చేయడానికి కూడా కొంత మంది వెనుకాడటం లేదు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామంలో విద్యుత్ బకాయిల కోసం తిరుగుతున్న ఏఈని పట్టుకుని గ్రామ సర్పంచ్ చితకబాదాడు. చెప్పుతో  కొట్టి అనుచరులతో కలిసి పరుగులు పెట్టించి కొట్టారు. ఈ ఘటన విద్యుత్ ఉద్యోగులలో సైతం కలవరం రేపింది. 


 ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామంలో  విద్యుత్ బకాయిలు ఎక్కువగా ఉండటంతో కొంత కాలంగా సిబ్బంది వసూళ్ల కోసం తిరుగుతున్నారు. అయితే గ్రామస్తులు చెల్లించేదుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో పై అధికారులు ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగి అడిగి వేసారిని ఏఈ చివరికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. సిబ్బందిని తీసుకుని రాయింపల్లి గ్రామానికి వెళ్లారు. ప్రతీ ఇంటికి వెళ్లి బకాయి ఉన్న బిల్లులను వసూలు చేస్తున్నారు. కట్టని వారి విద్యుత్ కనెక్షన్‌ను తొలగిస్తూ వస్తున్నారు. ఈ విషయం సర్పంచ్ యోగేంద్రరెడ్డికి గ్రామస్తులు తెలిపారు. 


గ్రామం లోనీ ఒక ఇంటి బిల్లు 31వేల రూపాయిలకు చేరుకుంది. నెలల తరబడి కట్టకపోతూండటం.. ఏఈ అడిగినా దురుసుగా సమాధానం చెప్పడంతో.. విద్యుత్ కనెక్షన్ తొలగించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పారు. అయితే వారు సర్పంచ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన ముందుగా ఏఈకి ఫోన్ చేశారు.  విద్యుత్ కనెక్షన్ తొలగించవద్దని ఆదేశించారు. అయితే బిల్లులు చెల్లించాల్సిందేనని లేకపోతే విద్యుత్ కనెక్షన్లు తీసేయమని పై నుంచి ఆదేశాలున్నాయని ఏఈ గురుమూర్తి స్పష్టం చేశారు. ఈ సమయంలో గురుమూర్తి, సర్పంచ్ యోగేంద్రరెడ్డి మధ్య మాట మాట పెరిగింది. 


విద్యుత్ ఏఈపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్ యోగేంద్ర రెడ్డి వెంటనే.. తన అనుచరుల్ని తీసుకుని  విద్యుత్ కనెక్షన్ తొలగిస్తున్న సిబ్బంది వద్దకు వచ్చారు. గురుమూర్తిపై ఇష్టారాజ్యంగా దాడి చే్శారు. బూతులు తిడుతూ దాడికి దిగారు.   భౌతికంగా చెప్పు కాలి తో కొట్టారు  సర్పంచ్ యోగేంద్ర రెడ్డి. అక్కడ ఉన్న వారు  ఈ దాడిని ఫోన్‌లో చిత్రీకరించడంతో దాడి దృశ్యాలు వైరల్‌గా మారాయి. అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యోగేంద్రరెడ్డి  కరెంట్ బిల్లుల చెల్లించకపోయినా పర్వాలేదన్నట్లుగా గ్రామస్తులకు భరోసా ఇవ్వడం వల్లేనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని విద్యుత్ సిబ్బంది అంటున్నారు. 


అయితే ఏఈ గురుమూర్తిపై తాను దాడి చేయలేదని సర్పంచ్ యోగేంద్ర రెడ్డి అంటున్నారు.  విద్యుత్ కనెక్షన్ తొలగించవద్దని ఫోన్‌లో కోరితే తనను దుర్భాషలు ఆడారని.. కనుక్కుందామని వస్తే తనపై దాడి చేశారని అన్నారు. తాను దాడి చేయలేదన్నారు. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విద్యుత్ సిబ్బందిపై దాడి చేసిన వైఎస్ఆర్‌సీపీ సర్పంచ్ యోగేంద్రరెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలని విద్యుత్ ఉద్యోగులు అనంతపురం, ఉరవకొండలో ఆందోళనలు నిర్వహించారు. ఈకేసు విషయంలో పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏఈ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు.