TS Congress : కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలనుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎప్పటికప్పుడు ఆటంకాలు ఎదురవుతున్నాయి. పోలీసులు పోనివ్వడం లేదు. కాళేశ్వరం బయలుదేరిన మల్లు భట్టి విక్రమార్క బృందాన్ని పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అక్కడ కాలేశ్వరం ఉందా మాయమైందా సీఎల్పీ బృందం అక్కడ చూడకూడనివి ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. కాలేశ్వరం నీళ్లను ఎత్తిపోయడానికి విదేశాల నుంచి తీసుకొచ్చిన బాహుబలి మోటర్లు వరద ముంపులో మునిగిపోయాయని మీడియాలో కథనాలు వస్తున్నాయని.. మునిగిన బాహుబలి పంపులు తిరిగి పని చేస్తాయా లేదా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా అని మల్లు భట్టివిక్రమార్క్ ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతల అరెస్టులు
కాలేశ్వరంలో బాహుబలి మోటార్లు ఎందుకు మునిగాయి. ఎంత నష్టం వచ్చింది? అక్కడ జరుగుతున్న నిర్మాణ లోపాలు ఏంటి? తెలుసుకోవడానికి వెళుతున్న సీఎల్పీ బృందాన్నిపోలీసులతో ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని విక్రమార్క ప్రశఅనించారు. కాళేశ్వరం ఏమైనా నిషేధిత ప్రాంతమా? శత్రు దేశాలకు తెలియని సమాచారం అక్కడ పెట్టి దానిని ఏమైనా రహస్య ప్రాంతంగా ప్రకటించారా? ప్రాజెక్టుకు వెళ్లకుండా పోలీసులతో ఎందుకు అడ్డుకుంటున్నారు. పది రోజుల ముందు అధికారులకు సమాచారం ఇచ్చి మంగళ బుధవారాల్లో ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన తమ సీఎల్పీ బృందాన్ని ప్రివెంట్ కస్టడీ పేరిట అరెస్టులు చేయడం ఏమిటన్నారు.
ఏదో దాచి పెడుతున్నారని.. కాళేశ్వరంకు జరిగిన నష్టమెంతో చెప్పాలంటున్నరేవంత్
కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంపై ట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరంతోపాటు టీఆర్ఎస్ అవినీతి కారణంగా నిండా మునిగిన సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు పెట్టేందుకు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన మల్లు భట్టి విక్రమార్క. నేతృత్వంలోని సీఎల్సీ బృందాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పొదెం వీరయ్యలను అరెస్ట్ చేసి పిరికిపందలా వ్యవహరించింది. గత నెలలో వరదలు వచ్చినప్పుడే కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టులకు భారీ నష్టం జరిగిందని మేము చెబితే ప్రభుత్వం మా మాటలను పట్టించుకోకుండా మూర్ఖంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
కాళేశ్వరం బాహుబలి మోటార్లు అన్నీ ధ్వంసం అయ్యాయని అనుమానాలు
గోదావరి వరదల వల్ల జులై 14న అన్నారం (సరస్వతి), కన్నెపల్లి (లక్ష్మి) పంప్ హౌస్లు నీట మునిగాయి. కన్నెపల్లి పంప్ హౌస్ లో క్వాలిటీ లేకుండా కట్టిన ప్రొటెక్షన్ వాల్, దాంతోపాటే క్రేన్లు, లిప్పు కూలడంతో మోటార్లు తుక్కుతుక్కు అయ్యాయి. డిజైన్ లోపం అన్నారం పంప్ హౌసుకు శాపంగా మారింది. ఫలితంగా వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇంజనీరింగ్ నిపుణలు పేర్కొంటున్నారని రేవంత్ రెడడి గుర్తు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం అత్యంత బాధ్యతరాహిత్యంగా.. కేవలం రూ.25 కోట్ల నష్టం మాత్రమే జరిగిందని, ఆ నష్టాన్ని కూడా కాంట్రాక్ట్ సంస్థే భరిస్తుందని అబద్ధాలను ప్రచారం చేయించారని మండిపడ్డారు.
ప్రజలకు వాస్తవాలు చెప్పకపోతే ఉద్యమం
ప్రభుత్వంతో సమానంగా ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద కూడా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టులను సందర్శించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ నిరకుశంగా వ్యవహరిస్తోందన్నారు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమీ నష్టం జరగకుంటే దాన్ని చూపించడానికి కేసీఆర్ ఎందుకు వణుకుతున్నారని ప్రశ్నించారు. పంపు హౌసులు మునగకుంటే, మోటార్లు విధ్వంసం కాకుంటే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలకు చూపించడానికి కేసీఆర్ ఎందుకు భయపడతున్నారని రేవంత్ ప్రశ్నించారు. మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ప్రాజెక్టుల సందర్శనకు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని.. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రేవంత్ హెచ్చరించారు.