YSR District News : వైఎస్సార్ జిల్లాలో బాలికల మిస్సింగ్ ఘటనలు తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మండలాల్లో ముగ్గురు అమ్మాయిలు కనపడకుండా పోయారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ఒక రోజు వ్యవధిలోనే బాలికలను కనిపెట్టారు. ముగ్గురు బాలికల మిస్సింగ్ కేసును 24 గంటల్లో జమ్మలమడుగు పోలీసులు ఛేదించారు. వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణ పోలీసు స్టేషన్ లో డీస్పీ నాగరాజు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జమ్మలమడుగు మండలం రాజీవ్ కాలనీకి చెందిన అక్కా చెల్లెలు ఈనెల 25వ తేది మధ్యాహ్నం ఇంట్లో నుంచి పారిపోయారు. అక్కా చెల్లెళ్ల పెద్దమ్మ కూతురు ప్రొద్దుటూరులో నివాసం ఉంటుంది. ఆ బాలిక సైతం ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. ఈ ముగ్గురు సింహాద్రిపురం మండలం లోమడ చర్చి వద్దకు చేరుకున్నారు. ఈనెల 26వ తేది రాత్రి జమ్మలమడుగు పోలీసు స్టేషన్ లో బాలికల తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. వీరి అచూకీ కోసం గాలిస్తున్న పోలీసు బృందాలకు విషయం తెలియడంతో వారిని అదుపులోనికి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. కుటుంబ సభ్యులు మందలించడంతో బాలికలు ఇంట్లో నుంచి పారిపోయినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు.
డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కేసు
కడప జిల్లాలో సంచలనం రేపిన డిగ్రీ విద్యార్థిని అనూష అనే విద్యార్ధి మిస్సింగ్, అనుమానాస్పద మృతి కేసు విచారణపై పోలీసులు వేగాన్ని పెంచారు. అయితే అనూష మృతికి ప్రేమ వ్యవహారమే కారణం అని ప్రాథమికంగా నిర్ధారణకు వ్చచినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అనూష మృతికి సంబంధించిన విషయాల గురించి తెలిపారు. అయితే మొన్న యువకులతో కలిసి కళాశాల నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి మరణానికి కారణమైన మహేష్ అనే యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ మహేష్ అనే యువకుడు తనను తరచుగా వేధించడం, పలు ఇతర కారణాల వల్ల ఆమె నీటిలో మునిగి బలవన్మరణానికి పాల్పడిందని పేర్కొన్నారు.
ఆత్మహత్యే?
బద్వేల్ లో అనూష అదృశ్యానికి సంబంధించి.. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే దర్యాప్తు మొదలు పెట్టామని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టామని, సిద్దవఠం, నెల్లూరు, బద్వేల్ లో సీసీ టీవి ఫుటేజ్ పరిశీలించామని వివరించారు. అయితే ఈనెల 23వ తేదీన సిద్దవఠం వద్ద పెన్నా నది ఒడ్డున అనూష మృతదేహం లభ్యమైందని ఎస్పీ అన్బురాజ్ తెలిపారు. సంఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించామని, మృతదేహంపై ఎక్కడా ఎలాంటి గాయాలు లేవని, ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. అనూషది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు.
Also Read : Rape In Orphanage: డీఏవీ స్కూల్ తరహాలో ఘటన, అనాథ మైనర్ బాలికపై అత్యాచారం!