హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ బాలికపై జరిగిన అత్యాచార వ్యవహారం మరువక ముందే అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నేరెడ్‌మెట్ జేజే నగర్ లోని గ్రేస్ అనాథాశ్రమంలో ఓ మైనర్ బాలికకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఈ నెల 19న ఆశ్రమం నుంచి నలుగురు యువతులు కనిపించకుండా పోయారు. అందులో ఒకరు మేజర్ కాగా మరో ముగ్గురు మైనర్ బాలికలు. దీంతో నేరేడ్ మెట్ పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. విచారణ అనంతరం ఇద్దరిని సికింద్రాబాద్ లో, మరో ఇద్దరిని బంధువులు ఇంట్లో గుర్తించారు. అనంతరం వారిని సఖి సెంటర్ కు పోలీసులు తరలించారు.


సఖి సెంటర్ లో మైనర్ బాలికను ప్రశ్నించగా, తనపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని బయటపెట్టింది. ఆశ్రమంలోనే అకౌంటెంట్‌గా పని చేస్తున్న మురళి అనే యువకుడు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా బాలిక చెప్పింది. ఆ బాలిక ఫిర్యాదుతో మురళితో పాటు నిర్వహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదుచేసిన గోపాలపురం పోలీసులు నిందితుడు మురళిపై పోక్సో, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, గ్రేస్ అనాథశ్రమం నిర్వాహకుడు విక్టర్ అతని భార్య భవానిపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు బుక్ చేసి రిమాండ్ కు తరలించినట్లు నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ నరసింహ స్వామి చెప్పారు. ఈ అనాథ ఆశ్రమంలో ఉన్న 35 మందిని నింబోలి అడ్డాలోని హస్టల్ కు తరలించారు అధికారులు.


సంచలనంగా డీఏవీ స్కూల్ కేసు


బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూలు DAV School Incident లో ఎల్‌కేజీ చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్‌ వాహన డ్రైవర్‌ రజనీ కుమార్‌ (34) లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. స్కూలులో ప్రిన్సిపల్‌ రూమ్ సమీపంలోని డిజిటల్‌ తరగతి గదిలోనే ఆ డ్రైవర్ చిన్నారిపై లైంగిక దాడి చేసినా ప్రిన్సిపల్‌ మాధవి (56) నిరోధించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని పోలీసులు ఆమెపై కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరికీ స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు (Chanchalguda Jail) తరలించారు.


ఈ ఘటనపై వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే స్కూల్ రద్దుతో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు కోరారు.


స్కూలు గుర్తింపు రద్దుకే మొగ్గు


హైదరాబాద్‌లోని డీఏవీ స్కూలు (DAV School Incident) ఘటనలో ప్రభుత్వం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఆ స్కూలు గుర్తింపును విద్యాసంవత్సరం మధ్యలో రద్దు చేస్తే అక్కడ చదువుతున్న పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆ మేరకు కొన్ని అభ్యర్థనలు వస్తున్నా, ప్రభుత్వం స్కూలు గుర్తింపు రద్దుకే మొగ్గు చూపుతోంది.