Top 5 WaterFalls in Telangana | ములుగు జిల్లా బోగత జలపాతంలో విషాదం చోటు చేసుకుంది. వాజేడు మండల పరిధిలో బోగత జలపాతం (Bogatha WaterFalls) చూసేందుకు వెళ్లిన యువకుడు నీళ్లలో పడి గల్లంతయ్యాడు. బోగత జలపాతం వద్ద ఈ విషాద ఘటన మంగళవారం (జులై 23న) చోటుచేసుకుంది.


గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షాలు కురిసే సమయంలో జలపాతం అందాలు వీక్షించాలని అంతా అనుకుంటారు. ఈ క్రమంలో హనుమకొండలోని కాశీ బుగ్గకు చెందిన బొనగాని జస్వంత్ స్నేహితులతో కలిసి బొగత వాటర్ ఫాల్స్ అందాలను వీక్షించేందుకు వెళ్లాడు. మొత్తం 8 మంది బోగత జలపాతం వద్దకు వెళ్లారు. అయితే జలపాతం వద్ద ఏర్పాటు చేసిన ప్రదేశంలో స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో జస్వంత్ గల్లంతయ్యాడు. 


స్నేహితుడి మృతితో తీవ్ర విషాదం


స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో జస్వంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సమయానికి జస్వంత్ మృతదేహాన్ని వెలికి తీశారు. అప్పటివరకూ సరదాగా గడిపిన యువకులలో ఒకరు చనిపోవడంతో విషాదం నెలకొంది. సరదాగా వాటర్ ఫాల్స్ చూద్దామని వెళ్తే యువకుడు ప్రమాదవశాత్తూ చనిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటకులను నీళ్లలోకి ఎవరు అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. రెస్క్యూ టీమ్ సకాలంలో స్పందించక పోవడంతో జస్వంత్ చనిపోయాడని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అక్కడున్న వారు చెబుతున్నారు. 


Also Read: హైదరాబాద్‌కు దగ్గర్లోనే అందమైన వాటర్ ఫాల్స్, పొద్దున్నే వెళ్తే సాయంత్రానికి వచ్చేయొచ్చు!


ప్రత్యేక ఆకర్షణగా బోగత వాటర్ ఫాల్స్
కొన్ని వర్షాలుగా కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతుంది. ములుగు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలు తెలంగాణ నయాగరాగా ఫేమస్ అయిన బోగత జలపాతం వీక్షించేందుకు క్యూ కడుతున్నారు. బాహుబలి సినిమా స్టైల్ లో ఈ జలపాతం ఉండడం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు బోగత జలపాతం ఉప్పొంగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి సైతం వరద నీరు పోటెత్తుతోంది. దాంతో ఎత్తైన కొండల నుండి జాలువారుతున్న జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది.


అధికారుల సూచనలు తప్పక పాటించాలి, లేకపోతే అంతే సంగతి


వరద ప్రవాహం అధికం కావడంతో బోగత వాటర్ పాల్స్ వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. నీటి ఉధృతి ఎక్కువగా ఉందని, పర్యాటకులు ఎవరూ బోగత వాటర్ ఫాల్స్ చూసేందుకు తదుపరి ప్రకటన వరకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. ప్రమాద స్థాయిలో నీటి ప్రవాహం ఉండటంతో బొగత జలపాతం వద్దకు పర్యాటకులకు అనుమతి లేదు. నీళ్లలోకి సైతం అంతేకాకుండా దిగకూడదని ఫారెస్ట్ అధికారులు, ఇతర సిబ్బంది చెబుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు.
Also Read: తెలంగాణలో టాప్ 10 Waterfalls, ఈ వర్షాకాలంలో తప్పకుండా వెళ్లి ఆస్వాదించండి