Hyderabad News  : చిన్నపాటి అజాగ్రత్త కూడా ప్రమాదాలకు దారి తీస్తుంది. నేటి కాలంలో బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యులు భయపడుతూ ఉంటారు. రోడ్డుపై చాలా జాగ్రత్తగా నడవాలని, వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే ఉంటుంది. అలాగే బస్సులో ప్రయాణించే వాళ్లు ఫుట్ బోర్డు ప్రయాణం చేయవద్దని అది ప్రమాదకరమని హెచ్చరిస్తూనే ఉంటారు. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. టైం అయిపోతుంది కదా అని తొందరపడితే ప్రాణాలే పోతాయి. తాజాగా ఓ విద్యార్థిని ఫుట్ బోర్డులో ఉండగా కాలుజారి  టైర్ల కింద పడి ప్రాణాలు పోగొట్టుంది.  ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.


బస్సు ఆపేలోపే గాల్లో ప్రాణాలు
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున్న ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  మ‌ధురా న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఆర్టీసీ బ‌స్సులో నుంచి ఓ విద్యార్థిని కాలుజారి ప‌డింది. బస్సు ఆమె పై నుంచి పోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టుకుంది.  ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ అప్రమత్తమై బ‌స్సును ఆపేశాడు.  సదరు విద్యార్థిని యూసఫ్ గూడలోని మాస్టర్స్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆమెను మెహరీన్ గా గుర్తించారు. విద్యార్థిని ఆర్టీసీ బస్ కోసం యూసఫ్ గూడ బస్టాండ్ వద్ద వేచి ఉంది. తను గమ్యం చేరుకునేందుకు వెళ్లాల్సిన బస్సు రావడంతో బస్సు రన్నింగ్ లో ఉండగానే ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఊహించని విధంగా కాలు జారి బస్సు చక్రాల కింద పడిపోయింది. సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు మెహరీన్ కు  సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ అప్పటికే ఆమె పై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో స్పాట్లోనే చనిపోయింది. 






కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న మధురా నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.