Kadapa News: రోజూలాగే ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన అమ్మాయి.. అక్కడి ఐదుగురు యువకులతో కలిసి కోటను చూసేందుకు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె జాడ కనిపించడం లేదు. తీవ్ర భయాందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి మృతదేహం లభ్యమైంది. మృతదేహం తలపై వెంట్రుకలు లేకపోవడం, ఓ వైపు మొహమంతా కాలి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. 


కాలేజీకి వెళ్లిన డిగ్రీ విద్యార్థిని తిరిగిరాలేదు 
వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం మారాటిపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష బద్వేల్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఈనెల 20వ తేదీన రోజూలాగే కళాశాలకు వెళ్లింది. కానీ సాయంత్రం గడుస్తున్నా అమ్మాయి ఇంటికి రాలేదు. ఆమె స్నేహితులకు, కళాశాల యాజమాన్యానికి, బంధువలకు ఫోన్ చేశారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలే రోజులు బాగోలేవని.. పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిదని భావించిన తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే మూడు రోజుల తరువాత సిద్ధవటం మండలం జంగాలపల్లి వద్ద పెన్నా నదిలో అనూష శవమై కనిపించింది. మృతదేహం తమ కుమార్తెదేనని అనూష తల్లిదండ్రులు గుర్తించారు. మృతదేహంపై తలపైన వెంట్రుకలు ఈడిపోయి ఉండడం, మొహానికి ఓవైపు కాలినట్లు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


దీనంతటికి బద్వేల్ మండలం పాపిరెడ్డి పల్లెకు చెందిన గురు మహేశ్వర్ రెడ్డియే కారణం అని అనూష తల్లిదండ్రులు సిద్ధవటం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుమహేశ్వర్ రెడ్డి, అనూష ఇద్దరూ ఓకే కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. అయితే ఈనెల 20వ తేదీన గురు మహే్ృశ్వర్ రెడ్డి, అనూష, మరో నలుగురు యువకులు కలిసి సిద్ధవటం కోటకు వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. సిద్ధవటం కోటకు వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటనా స్ఖలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనూష తల్లిదండ్రుల ఫిర్యాదుతో గురు మహేశ్వర్ రెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు తీరుపై అనూష కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసుపై దర్యాప్తు జరుగుతోందన్న డీఎస్పీ వంశీధర్ గౌడ్.. గురు మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. 


పక్కింటివారే హత్య చేశారు - గోతాంలో కట్టి పెన్నాలో పడేశారు


నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ హత్య స్ధానికంగా కలకలం రేపింది. పక్క పక్కన ఇళ్లలో నివసించే వారి మధ్య గొడవ మొదలై చివరకు ఓ నిండు ప్రాణం బలైంది. హత్య పథకం వేసిన అన్నదమ్ములు, మూడో కంటికి తెలియకుండా ఆ పథకం అమలు చేశారు. చివరకు పాత కక్షల వల్ల పక్కింటి వ్యక్తిని హత్య చేశారని తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. పైకి నమ్మకంగా ఉంటూ చివరకు హత్య చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు సమీపంలోని స్టౌబీడీ కాలనీకి చెందిన షేక్‌ గౌస్‌ మొహియుద్దీన్‌ కనిపించడంలేదని అతని భార్య సలీమా ఈనెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సహజంగా ఇరుగు పొరుగువారిని విచారించారు. వారంతా ఆయనతో శతృత్వం లేనట్టే చెప్పారు. అయితే హంతకులు తమకు తామే బయటపడ్డారు. పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టే సరికి భయంతో నిజం చెప్పేశారు.