Twist In Rajendra Nagar Theft Case: రంగారెడ్డి (Rangareddy) జిల్లా రాజేంద్రనగర్ ఎర్రబోడలోని ఓ ఇంట్లో గురువారం ఉదయం జరిగిన చోరీ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. చోరీ పేరుతో యువతి ఆడిన హైడ్రామాను పోలీసులు బట్టబయలు చేశారు. ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో చోరీ జరిగిందని ఓ యువతి కేకలు వేసింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని రూ.25 వేల నగదు, నగలు అపహరించుకుపోయారని యువతి పోలీసులకు తెలిపింది. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. తనను తోసేసి పారిపోయినట్లు వెల్లడించింది.
అసలు ట్విస్ట్ ఏంటంటే.?
చోరీ కేసుపై విచారణ ప్రారంభించిన పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దించారు. సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఎక్కడా చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో సదరు యువతిని పోలీసులు గట్టిగా నిలదీయడంతో అసలు నిజం వెల్లడించింది. ఇటీవల ఆన్ లైన్ గేమ్స్ ఆడిన యువతి రూ.25 వేలు పోగొట్టుకుంది. ఆ నగదు స్నేహితుల వద్ద నుంచి తీసుకోగా.. వారు డబ్బు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో చోరీ డ్రామాకు తెరలేపింది. పథకం ప్రకారం బీరువాలోని బట్టలు చిందరవందరగా పడేసి.. చోరీ జరిగిందని నమ్మించేలా గట్టిగా కేకలు వేసినట్లు సదరు యువతి అంగీకరించిందని పోలీసులు తెలిపారు. యువతి డ్రామాతో పోలీసులతో పాటు స్థానికులు షాక్ అయ్యారు.
Also Read: Kavitha CBI Arrest: ఎమ్మెల్సీ కవితకు కోర్టులో దక్కని రిలీఫ్, అందుకు నిరాకరించిన జడ్జి