Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఒకసారి అరెస్టు అయిన కల్వకుంట్ల కవితను.. నేడు (ఏప్రిల్ 11) మరోసారి సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్టు చేయగా.. తీహార్ జైలులో ఉన్న కవితను నేడు సీబీఐ అరెస్టు చేసింది. అయితే, ఈ సీబీఐ అరెస్టు విషయంలో కవిత కోర్టుకు వెళ్లారు. అయితే, అక్కడ ఆమెకు చుక్కెదురైంది. అత్యవసర విచారణకు జడ్జి నిరాకరించారు.


సీబీఐ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇదే రోజు (ఏప్రిల్ 11) కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అరెస్టుపై అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ బెంచ్ ముందు కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ ఫైల్ చేశారు. కవితకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా సీబీఐ అరెస్ట్ చేసిందని కవిత తరఫు లాయర్లు రాణా, మోహిత్ రావు జడ్జి ఎదుట వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తన ఎదుట లిక్కర్ కేసుకు సంబంధించిన వాదనలు జరగలేదని.. ఆ కేసు వివరాలు తనకు తెలియదని తెలిపారు. ఈ కేసులో తాను ఎలాంటి రీలీఫ్ ఇవ్వలేనని చెప్పారు.


సీబీఐ కేసు గురించి ఎలాంటి సమాచారం లేదని.. ఇక్కడ అత్యవసర జడ్జిమెంట్లపై మాత్రమే వాదనలు జరుగుతున్నాయని తెలిపింది. రేపు (ఏప్రిల్ 12) ఉదయం 10 గంటలకు రెగ్యులర్ కోర్టు ముందు పిటిషన్ ఫైల్ చేయమని న్యాయమూర్తి సూచించారు. కవిత న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ ను మెజిస్ట్రేట్ కావేరి భవేజా ధర్మాసనానికి సీబీఐ కోర్టు బదిలీ చేసింది. దీంతో ఈ పిటిషన్ రేపు ఉదయం 10 గంటలకు విచారణకు వస్తుందని భావిస్తున్నారు.