Man Died In Oyo Room : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఏడేళ్లు నుంచి అనేక ప్రాంతాలకు కలిసే తిరిగారు. ఇదే క్రమంలో తాజాగా ఓ ఫంక్షన్‌కు వచ్చారు. ఆ ఫంక్షన్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్లాలనుకున్నారు. కానీ అప్పటికే రాత్రి కావడంతో నగరంలోనే ఉండిపోయారు. ఓయో రూమ్ తీసుకుని అందులో ఉన్నారు. తెల్లవారితే ఇంటికి వెళ్ళిపోవాలని భావించారు. కానీ విధి మరోలా తలిచింది.


ఓయో రూముకు వెళ్ళిన గంటల వ్యవధిలోనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాత్రూం కి వెళ్ళిన యువకుడు అపస్మారక స్థితిలో పడిపోవడంతో.. వెంటనే అప్రమత్తమైన యువతి యువకుడు స్నేహితులకు సమాచారాన్ని అందించింది. అయితే అప్పటికే యువకుడు మృతి చెందడం అనేక అనుమానాలకు కారణమైంది. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.


ఓయో లాడ్జిల్లో ఈ మధ్య కాలంలో అనుమాన్పాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రూములకు వెళ్లిన వారిలో ఎవరో ఒకరు చనిపోతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జర్లకు చెందిన హేమంత్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలితో కలిసి ఓయో రూముకు వెళ్లిన యువకుడు మృతి చెందడం అనేక అనుమానాలకు కారణమవుతోంది. ఈ మృతికి సంబంధించి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ శ్రావణ్‌ కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


జడ్చర్ల ప్రాంతానికి చెందిన హేమంత్‌ (28) ఇటుకల వ్యాపారిగా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతితో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీయడంతో ఎప్పటికప్పుడు బయట కలుస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే ఇద్దరూ కలిసి సోమవారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓయో టౌన్‌ హౌస్‌లో గది తీసుకుని రాత్రికి అక్కడే బస చేశారు. రాత్రంతా ఇద్దరూ కలిసే రూములో ఉన్నారు. అయితే, రాత్రి రెండు గంటలు తరువాత బాత్రూమ్‌లోకి వెళ్లిన హేమంత్‌ బయటకు రాకపోవడంతో యువతి ఆందోళన చెందింది. లోపలకు వెళ్లి చూడగా హేమంత్‌ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన యువతి.. యువకుడు స్నేహితులకు సమాచారాన్ని అందించింది. 


మృతి చెందినట్టు నిర్ధారించిన పోలీసులు


స్నేహితులు వచ్చి హేమంత్‌ను మంచంపై పడుకోబెట్టి ప్రాథమిక వైద్యం అందించే ప్రయత్నం చేశారు. అప్పటికీ స్పృహలోకి రాకపోవడంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అంబులెన్స్‌ సిబ్బంది హేమంత్‌ను పరీక్షించగా.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన హేమంత్‌ తల్లిదండ్రులు పోలలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు బాత్రూమ్‌లో ఏం జరిగిందన్న దానిపై పోలీసులు దృష్టి సారించి విచారణ సాగిస్తున్నారు. ఎవరైనా బాత్రూమ్‌లో ఉండి ఏదైనా చేశారా..? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఏది ఏమైనా ఓయో రూముకు వెళ్లిన యువకుడు మృతి చెందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.