Schools Gets Bomb Threats: ఢిల్లీ,నోయిడాలోని పలు స్కూల్స్‌కి బాంబు బెదిరింపులు రావడం స్థానికంగా అలజడి సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్‌లో బాంబు పెట్టామంటూ ఈమెయిల్ పంపారు. ఇది చూసిన వెంటనే అప్రమత్తమైన యాజమాన్యాలు విద్యార్థులను బయటకు పంపాయి. పోలీసులకు సమాచారం అందించాయి. అన్ని చోట్లా పోలీసులు సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్‌, మయూర్ విహార్‌లోని మథర్ మేరీ స్కూల్‌, ద్వారకాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి ముందుగా ఈ మెయిల్స్ వచ్చాయి. ఆ తరవాత వరుసగా మరో 5 స్కూల్స్‌కి ఇవే బెదిరింపులు వచ్చాయి. ఓ స్కూల్‌లో ఎగ్జామ్ జరుగుతుండగా ఈ మెయిల్ రావడం కలకలం రేపింది. వెంటనే పరీక్షను రద్దు చేసి స్కూల్‌ని ఖాళీ చేయించారు. 






అన్ని స్కూల్స్‌లోనూ ఎమర్జెన్సీ ప్రకటించి విద్యార్థులను బయటకు పంపించారు. ఈ బెదిరింపు ఈమెయిల్స్‌పై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్పందించింది. స్కూల్‌కి బాంబు పెట్టినట్టు మెయిల్ వచ్చిందని, విద్యార్థులందరినీ చంపేస్తామని బెదిరించారని వెల్లడించింది. పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఇళ్లకు పంపినట్టు వివరించింది. పోలీసులతో పాటు అన్ని స్కూల్స్‌లోనూ బాంబ్ స్క్వాడ్‌ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్‌ సిబ్బంది కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంది. ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. అయితే...ఈ బెదిరింపు మెయిల్స్ ఎవరు పంపారో ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. IP అడ్రెస్ ఆధారంగా ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 


"సిటీ అంతా ఒక్కసారిగా కలకలం రేగింది. ఇన్ని స్కూల్స్‌కి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ఆందోళన కలిగించింది. ప్రస్తుతానికి సైబర్ సెల్ యూనిట్ ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రాక్ చేస్తోంది"


- పోలీస్ అధికారులు 






ఇప్పుడే కాదు. గతంలోనూ ఇదే విధంగా ఢిల్లీలో పలు స్కూల్స్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూల్‌లో బాంబు పెట్టామంటూ మెయిల్స్ పంపారు. ఆ తరవాత కర్ణాటకలోనూ ఇదే విధంగా బెదిరింపు మెయిల్స్ రావడం సంచలనం సృష్టించింది. ఇలా తరచూ జరుగుతుండడం పోలీసులను, స్కూల్ యాజమాన్యాలను టెన్షన్ పెడుతోంది. 


Also Read: 98 ఏళ్ల వయసులో చేతికర్రతో 10 కిలోమీటర్ల కాలినడక, ఉక్రెయిన్ వృద్ధురాలి సాహసం