Young Man Forceful Death Due to His Girl Friend Death in Macherial: వారిద్దరూ చిన్న నాటి స్నేహితులు. ఇరువురి మనసులూ కలిశాయి. ఒకే సామాజిక వర్గం కావడంతో సంతోషించారు. మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో ఒక్కటవ్వాలని భావించారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే, ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఆ విషయం తెలుసుకున్న యువకుడు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన మంచిర్యాల (Mancherial) జిల్లాలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల మండలం చిత్తపూర్ గ్రామానికి చెందిన తీగుళ్ల భగవాన్(23), మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన సంగీత(21)ల మధ్య పాఠశాల స్థాయిలోనే ప్రేమ చిగురించింది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించారు. కాగా, సంగీత రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. భగవాన్ డీసీఎం వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం తన అక్క కొడుకు చిన్నారి వియాన్ కు భోజనం తినిపించే విషయమై సంగీత చిరాకు పడింది. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆమెను మందలించి.. అనంతరం కూలీ పనికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎవరితోనో ఫోన్ మాట్లాడిన ఆమె ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు అచేతన స్థితిలో ఉన్న సంగీతను వెంటనే మందమర్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో కొన్ని రోజులుగా గొడవ జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అమ్మాయికి పెళ్లి సంబందాలు చూస్తుండటంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
ప్రియుడి సైతం
ప్రియురాలి మృతి విషయం తెలుసుకున్న భగవాన్ సైతం బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతను డీసీఎం వ్యాన్ లో పత్తిలోడును. కుమురం భీం జిల్లా రేపల్లివాడ జిన్నింగ్ మిల్లుకు తీసుకెళ్లి మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యాడు. బెల్లంపల్లికి చేరుకోగానే సంగీత మృతి చెందిన విషయం తెలిసింది. వెంటనే పురుగుల మందు కొనుగోలు చేసి బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామ సమీపంలోని మామిడితోటలో వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోని సోదరుడు భరత్.. భగవాన్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ క్రమంలో ఆందోళనతో దారి వెంట వెతుకుతూ వెళ్లగా రహదారిపై వ్యాన్ కనిపించింది. పక్కనే ఉన్న మామిడితోటలో అపస్మారక స్థితిలో భగవాన్ కనిపించాడు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అదే డీసీఎం వ్యాన్ లో తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని భగవాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాళ్లగురిజాల ఎస్సై నరేష్ తెలిపారు. ప్రేమ వ్యవహారంలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
Also Read: Jammikunta MRO: జమ్మికుంట తహసీల్దార్ ఆస్తులు రూ.20 కోట్లు -రేపు కరీంనగర్ కోర్టుకు రజనీ