Woman Lawyer Killed: 


మహిళా లాయర్ హత్య 


ఢిల్లీలోని నోయిడాలో 61 ఏళ్ల మహిళా లాయర్‌ దారుణ హత్యకు గురైంది. బంగ్లాలో ఆమె డెడ్‌బాడీ దొరికింది. భర్తే ఆమెని హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. చంపిన తరవాత బంగ్లాలోని స్టోర్‌ రూమ్‌లో 36 గంటల పాటు దాక్కుని ఉన్నాడు నిందితుడు నితిన్ నాథ్. ఫోన్ ట్రాక్‌ చేసి మొత్తానికి నిందితుడుని అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో లాయర్‌గా పని చేస్తున్న రేణు సిన్హా ( Renu Sinha) ఇంట్లోనే హత్యకు గురయ్యారు. నోయిడా సెక్టార్ 30లోని బంగ్లాలో బాత్‌రూమ్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. కొడుకు విదేశాల్లో ఉండగా...వీళ్లిద్దరూ ఈ బంగ్లాలో ఉంటున్నారు. దాదాపు రెండు రోజులుగా రేణు సిన్హా ఎవరి ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం లేదు. ఆమె సోదరుడు కూడా చాలా సార్లు కాల్ చేశాడు. ఎంతకీ స్పందించకపోవడం వల్ల అనుమానంతో పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. వెంటనే ఆమె ఇంటికి వచ్చిన పోలీసులు ఇల్లంతా సోదా చేశారు. ఆమె భర్త కనిపించలేదు. ఆయన ఫోన్ నంబర్ సేకరించి ట్రాక్‌ చేశారు. ఆయన బంగ్లాలోనే స్టోర్‌ రూమ్‌లో ఉన్నట్టు తేలింది. వెంటనే స్టోర్‌ రూమ్‌లోకి వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. రేణు సిన్హాని భర్తే దారుణంగా చంపేశాడని ఆరోపించాడు ఆమె సోదరుడు. ఆ తరవాత విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం వెల్లడించారు. బంగ్లాని విక్రయించే విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. బంగ్లా అమ్మేయాలని, ఇప్పటికే ఓ పార్టీ వచ్చి టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేసిందని రేణు సిన్హాకి చెప్పాడు నితిన్ నాథ్. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఈ విషయంలో చాలా సేపు గొడవ జరిగింది. ఆవేశంతో ఆమెను హత్య చేశాడు భర్త. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.