Woman Suicide: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం జరిగింది. అమలాపురం డివిజన్ రాజోలు మండలం రాజోలు సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేశవదాసు పాలేనికి చెందిన యర్రంశెట్టి విజయ లక్ష్మి(36).. పీఎశ్ ఆవరణలోనే పెట్రోలు పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. సుమారు 15 నిమిషాల పాటు మంటలతో ఆర్తనాదాలు చేస్తున్న ఆమెను స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. ఇసుక, దుప్పట్లు వంటి వాటిని ఆమెపైకి విసిరారు.  స్థానికంగా ఉన్న హెల్త్ సిబ్బంది కూడా అక్కడకు చేరుకొని ప్రాథమిక చికిత్స చేసే ప్రయత్నం చేసింది. వెంటనే సమీపంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి చెక్కపై ఉంచి భుజాలపై మోసుకుని తీసుకెళ్లారు. ఆమె శరీరం 80 శాతం పైగా కాలిపోగా మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. అయితే ఆమె కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.


యూట్యూబ్ ఛానల్ కు పనిచేస్తూ... 
విజయలక్ష్మి ఓ యూట్యూబ్ న్యూస్ ఛానల్లో విలేకరిగా పనిచేస్తుంది. ఆమె భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. అప్పు ఇచ్చినవారు మలికిపురం మండలంలో తన అమ్మ ఇంటి వద్ద ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవడంతో పెద్దల సమక్షంలో మంతనాలు జరిగాయి. ఆమె శుక్రవారం రాజోలు సీఐకు ఫిర్యాదు చేయడానికి ఆమె ద్విచక్ర వాహనంపై వచ్చింది. ముందుగానే లీటర్ పెట్రోలు బాటిల్ వెంట తెచ్చుకున్న ఆమె స్థానికంగా కానిస్టేబుల్ ను సీఐని కలవాలని అడిగింది. అయితే సోమవారం వస్తారని చెప్పడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పు పెట్టుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


తెలంగాణలో యువకుడు ఆత్మహత్య.. 
యువకుడు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు హ్యాపీగా నడుస్తోంది లైఫ్. వర్క్‌ఫ్రమ్‌ కావడంతో అంతా కూల్‌ అనుకున్న టైంలో సమస్య మొదలైంది. హైదరాబాద్‌ ఎప్పుడెళ్తామంటూ భార్య నుంచి ఒత్తిడి మొదలైంది. కంపెనీ ఇంకా వర్క్‌ఫ్రమ్‌హోం చేయమంటోందని... కంపెనీ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్లిపోదామని సర్ది చెబుతూ వచ్చాడు. నెల రోజులు గడిచిన తర్వాత భార్య గర్భవతి అయ్యానని గుడ్‌ న్యూస్ చెప్పింది. అంతే ఎగిరి గంతేశాడు రాకేష్. అప్పుడు కూడా భార్య అడిగింది ఒక్కటే... హైదరాబాద్‌ ఎప్పుడు తీసుకెళ్తావని రాకేష్‌ మళ్లీ అదే సమాధానం చెప్పాడు. కుమార్తె గర్భవతి అని తెలియగానే పుట్టింటి వాళ్లు అత్తారింటి నుంచి ఆమెను తీసుకెళ్లారు. అక్కడే ఉంటున్నా.. రోజూ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేది. ఆమె తల్లిదండ్రులు కూడా వేధించడం మొదలుపెట్టారు. 


హైదరాబాద్ కు తీసుకెళ్లు లేకుంటే చచ్చిపో.. 
ఇలా రోజూ ఫోన్ చేసి ఇదే టార్చర్‌ చేసేవారని తెలుస్తోంది. రోజురోజుకు ఆ టార్చర్ డోస్ పెంచుతూ వచ్చారు. మొన్నటికి మొన్న వీడియో కాల్ చేసిన భార్య... తీసుకెళ్తే హైదరాబాద్‌ తీసుకెళ్లు లేకుంటే చచ్చిపోమని చెప్పడంతో రాకేష్‌కు కన్నీళ్లు ఆగలేదు. ధైర్యం చేసి భార్యను అడిగేశాడు. చావుకు, హైదరాబాద్‌కు ఏంటి లింకని... నువ్వు చచ్చిపోతే కదా.. వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటానని బదులిచ్చింది. భార్య మాట విన్న రాకేష్ మరింత షాకయ్యాడు. నోట మాట రాక కాల్‌కట్‌ చేశాడు. భార్య అత్తమామల మాటలు రాకేష్‌ మనసుకు చాలా బాధ కలిగించాయి. ఎంత ప్రయత్నించినా ఆ మాటలు మర్చిపోలేకపోయాడు. తీవ్రంగా కుంగిపోయాడు. అంతే సూసైడ్‌ నోట్‌ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మృతుడి భార్య, అత్తమామను అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.