Woman Burnt Alive In Medak District: మెదక్ జిల్లాలో (Medak District) దారుణం జరిగింది. మంత్రాల నెపంతో ఓ మహిళను కొందరు సజీవదహనం చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రామాయంపేట మండలం కత్రియాల గ్రామంలో ద్యాగల ముత్తవ్వ తన కొడుకు, కోడలితో నివాసం ఉండేది. ఆమె రోజూ ఇంటింటికీ వెళ్లి పలకరించేది. ఈ క్రమంలోనే గ్రామస్థులు ఆమెపై అనుమానం పెంచుకున్నారు. ముత్తవ్వ ఇళ్ల ముందుకు వచ్చి మంత్రాలు చేస్తుందని.. అందుకే తమ ఇళ్లల్లో కీడు జరుగుతుందని అనుమానించారు. ముగ్గురు తోడై వృద్ధురాలిని ఎలాగైనా చంపాలని ప్లాన్ చేశారు.
పెట్రోల్ పోసి..
గురువారం అర్ధరాత్రి ముగ్గురు ముత్తవ్వ ఇంటికి వెళ్లారు. ఆమె మంత్రాలు చదువుతుందనే అనుమానంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోసి తేరుకునే లోపే నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగగా ఆమె కేకలు వేసింది. వృద్ధురాలి కేకలు విన్న కొందరు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని పోలీసులు రామాయంపేట ఆస్పత్రికి తరలించారు. అయితే, తమపై కూడా దాడి చేస్తారనే భయంతో ముత్తవ్వ కొడుకు, కోడలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్‌లో విషాదం
అటు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మూడుచింతలపల్లి మండలం కొల్తూరులోని చెరువులో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లిన చిన్నారులు.. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు చెరువు వద్దకు వెళ్లి వారి మృతదేహాలను వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులు హర్ష, మణికంఠ, మనోజ్‌గా గుర్తించారు. వీరంతా 15 ఏళ్ల లోపు చిన్నారులే. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Crime News: తెలంగాణలో ఘోరం - ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం