West Godavari Crime : ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ జంట ప్రయాణం కొంత కాలం బాగానే సాగింది. అనంతరం వారి మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆ యువతి ఈగల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఎ.పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి సతీష్‌కు అదే గ్రామానికి చెందిన దేవికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడు నెలల పాప కూడా ఉంది. కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం సతీష్ పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో సతీష్, దేవి మధ్య మరోసారి గొడవ జరిగింది. అనంతరం సతీష్ తిరిగి పనికి వెళ్లిపోయాడు.
ఈగల మందు తాగి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దేవి ఇంట్లో ఉన్న ఈగలమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న దేవిని గమనించిన అత్త నిర్మల గమనించి, కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. అయితే ఈ ఘటనపై దేవి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవి, సతీష్‌లది ప్రేమ వివాహం అని, అయితే సతీష్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఇటీవల దేవి కుటుంబ సభ్యులు సతీష్ ను అడిగితే, దేవిని కొట్టాడని దీంతో మనస్తాపం చెంది ఈగల మందు తాగిందని ఫిర్యాదులో తెలిపారు. అయితే సతీష్ బలవంతంగా తన చెల్లితో ఈగల మందు తాగించాడనే అనుమానం కూడా ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ పేరిట మోసం, రూ.12.45 లక్షలు స్వాహా
ప్రేమ సమస్య నుంచి బయటపడేందుకు ఓ మహిళా వైద్యురాలు మాంత్రికుడి సాయం తీసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే గూగుల్ లో స్వామీజీ కోసం వెతికింది. కానీ దురదృష్టవశాత్తు నైజీరియన్ల వలకు చిక్కింది. దాదాపు 12.45 లక్షల రూపాయలు మోసపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా.. ఇద్దరు నిందితులు చిక్కారు. మరో ఇద్దరు తప్పించుకొని పారిపోయారు.
అసలేం జరిగిందంటే..?
నైజీరియాకు చెందిన 41 ఏళ్ల ఒక్వుచుక్వు, 35 ఏళ్ల జోనాథన్, మైఖేల్ అజుండా, డేనియల్, వస్త్రాల వ్యాపార నిమిత్తం కొన్నేళ్ల క్రితం భారత్ కు వచ్చి నష్టపోయారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు దిల్లీ కేంద్రంగా మోసాలు చేయడం ప్రారంభించారు. ఏ సమస్యకు అయినా పరిష్కారం చూపిస్తామంటూ ఇంటర్ నెట్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఫోన్ నంబర్లు ఉంచారు. సంప్రదించిన వారిని మాయ మాటలతో నమ్మించి డబ్బు లాగుతున్నారు. కుషాయిగూడకు చెందిన కంటి వైద్యురాలు తన ప్రేమ వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యలు, వృత్తిపరంగా విజయం సాధించేందుకు సలహాలు, పరిష్కారం కోసం గూగుల్ లో వెతికారు. అక్కడే ఆమెకు ఓ ఫోన్ నెంబర్ కనిపించింది. దీంతో వెంటనే ఆ మహిళా వైద్యురాలు ఆ నంబర్ కు ఫోన్ చేసింది. అయితే ఉగండాకు చెందిన వ్యక్తితో ప్రార్థనలు చేయించి సమస్య పరిష్కరిస్తామంటూ మభ్యపెట్టారు. రూ.12.45 లక్షలు వసూలు చేశారు. మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా... ఒక్వుచుక్వు, ఉజకలను దిల్లీలో అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పారిపోయారు.