Army Chief Manoj Pandey:


ఢీకొట్టేందుకు రెడీ..


జనవరి 15న సైనిక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు...ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో వాతావరణం భారత్‌కు అనుకూలంగానే ఉందని తేల్చి చెప్పారు. చైనాతో ఇప్పటికే చర్చలు కొనసాగు తున్నాయని వెల్లడించారు. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. అయితే...ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా భారత్‌ ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉందని ధీమాగా చెప్పారు. 


"సరిహద్దులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఇండియన్ ఆర్మీ మాత్రం రెడీగా ఉంది. చైనాతో మనకు 7 రకాల సమస్యలున్నాయి. ఇందులో దాదాపు 5 సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకున్నారు. మిలిటరీ కమాండర్ల స్థాయిలో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా పోరాడేందుకు సరిపడ సామగ్రి మా వద్ద సిద్ధంగా ఉంది" 


-ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే


ఇదే సమయంలో పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు మనోజ్ పాండే. కావాలనే టార్గెట్ కిల్లింగ్స్‌కు పాల్పడుతోందని విమర్శించారు. ఇటీవల జరిగిన రాజౌరీ ఘటనను ప్రస్తావిస్తూ దాయాదిపై మండిపడ్డారు. 


"పాకిస్థాన్‌ టార్గెట్ కిల్లింగ్‌కు పాల్పడుతోంది. పిర్ పంజాల్ రేంజ్‌లో మైనార్టీలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇదే ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకు రావడానికి పదేపదే ప్రయత్నిస్తున్నారు. బీఎస్‌ఎఫ్‌తో పాటు ఆర్మీ కూడా ఈ చొరబాటును అడ్డుకుంటున్నాయి. డ్రోన్‌ల సాయంతో నిలువరిస్తోంది. శత్రు దేశ డ్రోన్‌లు మనవైపు రాకుండా జామర్స్ ఏర్పాటు చేశాం. మునుపటితో పోల్చుకుంటే హింసాత్మక ఘటనలు కొంత మేర తగ్గాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ శాంతియుత వాతావరణం కనిపిస్తోంది" 


-ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే






రాజౌరిలో ఉగ్రదాడి 


జమ్ముకశ్మీర్‌లో ఇటీవలే  ఉగ్రదాడి జరిగింది. రాజౌరి ప్రాంతంలోనే మరోసారి అలజడి రేగింది. ఇప్పటికే ఇక్కడ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్పర్ డంగ్రీ గ్రామానికి చెందిన నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా...ఆరుగురు గాయాల పాలయ్యారు. మళ్లీ ఇదే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా...ఐదుగురు గాయపడ్డారు. సాధారణ పౌరులు చనిపోవడంపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. డంగ్రీలోని మెయిన్ చౌక్‌లో ఈ నిరసనలు కొనసాగు తున్నాయి. ఆ సమయంలోనే బాంబు  పేలుడు సంభవించింది. " అధికారులు, పోలీసులు దాడులు జరగకుండా ఆపడంలో విఫలమయ్యారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇక్కడికి రావాలి. మా డిమాండ్‌లు వినాలి" అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడిపై మనోజ్ సిన్హా స్పందించారు.  ఉగ్ర చర్యను ఖండించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. 


Also Read: Russia Ukraine Conflict: మరో పదేళ్లలో రష్యా పని ఖతం, సంచలనం సృష్టిస్తున్న సర్వే