దేశంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ తొలిసారిగా విశాఖ కు చేరింది. కానీ కొందరు అల్లరిమూక వందే భారత్ రైలుపై బుధవారం సాయంత్రం మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రాళ్ల దాడికి పాల్పడటం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన విశాఖ పోలీసులతో పాటు ఆర్పీఎఫ్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో వందేభారత్ రైలుపై దాడిచేసి కిటికీలు ధ్వంసం చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు.


నిందితులు మద్యం మత్తులో ఉన్నారని, అందుకే ఈ దాడి చేసి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితులపై రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి ఆర్పీఎఫ్‌ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పారు. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై డీఆర్ఎం అనూప్ సత్పతి విచారణకు ఆదేశించారు.  


గోశాల శంకర్, సిర్ల శివ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. అనంతరం శంకర్ రైల్వే గేట్ సమీపంలోని అండర్ బ్రిడ్జి వద్దకు చందు, రాజులను పిలిపించాడు. బుధవారం సాయంత్రం 05:30 గంటల సమయంలో ఒక కొత్త రైలు వెళ్తున్నట్లు చూసి మద్యం మత్తులో ఆకతాయిగా వందే భారత్ రైలు పై రాళ్లు రువ్వారు. తర్వాత ఆర్‌పిఎఫ్‌ వారు వారిని వెంబడించడంతో వారు పరుగెడుతూ పారిపోతూ శంకర్ తన చెప్పును వదిలేశాడు.సీసీ కెమెరా ఫుటేజీని ద్వారా నిందితులను గుర్తించారు. ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి, సిటీ పోలీసుల సంయుక్తముగా బృందాలుగా ఏర్పడి నిందితులను అరెస్ట్ చేశారని విశాఖ పోలీసులు తెలిపారు.


నిందితులు వీరే :


గోశాల శంకర్, s/o లేట్ సుబ్రమణ్యం మురుగన్, వయస్సు-22, Qr నం: 14, బ్లాక్-3, మదీనాబాగ్. ఇతను కంచరపాలెం పీఎస్‌లో అనుమానిత షీటర్‌. ఇతనిపై 04 ఆస్తి నేరాల కేసులు ఉన్నాయి. ఇతను నేరం అంగీకరించాడు. మద్యం మత్తులో ఆకతాయిగా రాళ్లు విసిరినట్టు దర్యాప్తులో అంగీకరించాడు.


మదీనాబాగ్‌కు చెందిన టేకేటి చందు గతంలో GRP PS హత్య కేసులో ప్రమేయం కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు.


పెద్దాడ రాజ్ కుమార్,S/o నాయుడు కర్మాకర్, వయసు-19, R/o -పెదనడుపూరు. ఆంజనేయశ్వని ఆలయం ఎదురుగా, పెద గంట్యాడ, గాజువాక.






నిందితులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు
రైలుపై దాడి జరిగిన ప్రదేశాన్ని వెస్ట్ జోన్ ఏసిపి అన్నపు నరసింహమూర్తి ఆర్పిఎఫ్ అధికారి బుధవారం పరిశీలించారు. విశాఖ నగరానికి వచ్చిన వందే భారత్ రైలు పై కంచరపాలెం రామ్మూర్తి పంతులు గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరి రైలు యొక్క అద్దం పగులుటకు కారణం అయ్యారు. తక్షణమే స్పందించిన విశాఖ నగర పోలీసులు జి.ఆర్.పి.ఎఫ్ కు, ఆర్.పి.ఎఫ్ కు పూర్తిగా సహకరిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ సిహెచ్. శ్రీకాంత్ వెంటనే నిందితులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఎంతో ప్రతిస్టాత్మాకముగా ప్రారంభమైన ఈ రైలు పై ఇటువంటి సంఘటన జరగడం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రముగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


వందే భారత్ లో పూర్తిగా చైర్ కార్ బోగీలుంటాయని వెల్లడించారు. కేవలం 8.40 గంటల్లో విశాఖ నుంచి సికింద్రాబాద్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.  విశాఖ చేరుకున్న వందే భారత్ రైలును నిర్వహణ పర్యవేక్షణ కోసం న్యూ కోచింగ్‌ కాంప్లెక్స్‌కు తరలించారు. ఈ ట్రైన్ పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షలో ఉంటుంది. ఈ సీసీ కెమెరాలు లోకో పైలెట్‌ క్యాబిన్‌కు అనుసంధానించి ఉంటాయి. లోకో పైలెట్‌ కంట్రోల్లోనే కోచ్‌ల తలుపులు తెరుచుకునే, మూసివేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. మెట్రో రైల్లో మాదిరిగా ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం టాక్‌ బ్యాక్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రవేశపెట్టిన వందే భారత్ ప్రత్యేక హై స్పీడ్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణ ప్రజల యొక్క అభిమానాన్ని చూసి ఓర్వలేని దుష్ట శక్తులు ఇలా దాడి చేశాయని సోము వీర్రాజు మండి పడ్డారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన దోషులను దుండగులను, ప్రోత్సహించిన దేశ వ్యతిరేక శక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈనెల 19వ తారీఖున ప్రారంభించనున్న ఈ రైలు రాకను ఎందుకు ఆ దుష్టశక్తులు వ్యతిరేకిస్తున్నాయో ప్రజలు గమనించాలని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.