Man Murder: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మేనకోడలితో రెండో పెళ్లికి బావ (అమ్మాయి తండ్రి) ఒప్పుకోలేదని అతడిని చంపేశాడో వ్యక్తి. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి మరీ కాల్చేశాడు. ఈ ఘటన గోపాలపురం మండలం భీమోలు రోడ్డులోని పోలవరం కుడి కాలువ గట్టుపై గత నెల 27వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేసి హంతకులను పట్టుకున్నారు.


అసలేం జరిగిందంటే..?


గత నెల 27వ తేదీన పోలవరం కుడి కాలువ గట్టుపై గుర్తు పట్టడానికి వీలు లేని విధంగా ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులుకు సమాచారం వచ్చింది. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. భీమోలు రోడ్డులోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం బుసురాజుపల్లికి చెందిన ఆదిమూలం ఏసు పాదాన్ని ప్రధాన నిందితుడిగా గుర్తించి విచారించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. అయితే ఏసుపాదానికి గతంలోనే పెళ్లి జరిగింది. పాప కూడా పుట్టింది. 


మేనకోడలితో పెళ్లికి ఒప్పుకోని బావపై కోపం పెంచుకున్న ఏసుపాదం!


హాయిగా సాగిపోతున్న వీరి కాపురంలో గొడవలు మొదలవడంతో.. భార్య పాపను తీస్కొని పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆకుతీగపాడులోని తన అక్క కూతురుని రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. వివాహం చేయమని బావను కోరగా.. అతడు నిరాకరించాడు. దీంతో ఏసుపాదం బావపై కోపం పెంచుకున్నాడు. అతడిని హత్య చేసేందుకు బుట్టాయగూడేనికి చెందిన దార రామ చంద్రారావు, బేతాళ శేఖర్, కొల్లి పవన్ కల్యాణ్ కు సుపారీ ఇచ్చాడు. మొత్తం రెండు లక్షల రూపాయలు ఇస్తానని.. ఎలాగైనా సరే తన బావను చంపేయాలని తెలిపాడు. ఈ క్రమంలోనే బావ రాజును గతనెల 27వ తేదీన ఇంటికి పిలిచిన ఏసుపాదం... ఫుల్లుగా మద్యం తాగించాడు. అప్పుడు ఏసుపాదం స్నేహితులు, సుపారీ తీసుకున్న గూండాలు కూడా పక్కనే ఉన్నారు. 


ఇనుప రాడ్డుతో కొట్టి హత్య, అనంతరం పెట్రోల్ పోసి!


అయితే తాగింది సరిపోలేదని బయటకు వెళ్లి తాగదామని చెప్పి పవన్ కల్యాణ్ కారులో, సమీపంలోని పోగొండ ప్రాజెక్టు దగగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగుతున్న సమయంలో వారి వెంట తెచ్చుకున్న ఇనుక రాడ్డుతో రాజు మెడ వెనుక భాగంలో కొట్టి చంపారు. సాక్ష్యాలు ఉండకూడదని మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కొయ్యలగూడెంలోని ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొనుగోలు చేశారు. అనంతరం గోపాల పురానికి తిరిగి వచ్చారు. అక్కడి నుంచి సమీప కాలువ గట్టుకు తీసుకెళ్లారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేసి పెట్రోల్ పోసి కాల్చేశారు. రోడ్డుపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నిజాలన్నీ వెలుగులోకి వచ్చాయి. కేసు ఛేదించిన డీఎస్పీ శ్రీనాథ్, ఎస్ఐ  ఎ.శ్రీనివాసరావు, ఎస్సైలు రామకృష్ణ, శ్రీహరి, రవీంద్రబాబు, ఇతర సిబ్బందిని అభినందించారు.