Warangal News : ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల బంధాన్ని ఓ చెరువు మింగేసింది. ఒకర్ని కాపాడే ప్రయత్నంలో మరొకరు అలా ముగ్గురు చెరువులో మునిగిపోయారు. వరంగల్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.  మృత్యువు ఎప్పుడు  ఏ రూపంలో వస్తుందో అంచనా వేయడం అసాధ్యం. అలాంటి ఘటన ఆదివారం వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చిన్నగురిజాలలోని ఓ చెరువులో పడి ఒకే కుటుంబానికి(Family) చెందిన ముగ్గురు చనిపోయారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోతున్న మనవడిని కాపాడేందుకు ప్రయత్నించిన తాతా, మనవడు ఇద్దరూ మునిగిపోయారు. తన తండ్రి, కొడుకును కాపాడేందుకు ప్రయత్నించిన బాలుడి తండ్రి కూడా చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు జలసమాధి అవ్వడంతో గ్రామంలో విషాదం అలముకుంది. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.  



ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి 


చిన్నగురిజాలలో చెరువులో జారిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టిస్తుంది. ఒకరిని రక్షించేందుకు మరొకరు అలా వెళ్లి మొత్తం ముగ్గురూ ప్రాణాలు విడిచారు. ముందు కాళ్లు కడుక్కునేందుకు కృష్ణమూర్తి(65), అతని మనవడు దీపక్(12)తో కలిసి చెరువులో దిగాడు. కృష్ణమూర్తి చెరువులోకి జారిపడటంతో మనవడు కాపాడేందుకు ప్రయత్నించి అతడు నీటిలో పడిపోయాడు. తన తండ్రి, కుమారుడిని కాపాడేందుకు చెరువులోకి దిగిన నాగరాజు(35) కూడా నీటిలో మునిగిపోయాడు. ముగ్గురూ చెరువులో పడి ఊపిరాడక చనిపోయారు. ఈ ఘటన సమాచారంపై అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మూడు మృతదేహాలను బయటకు తీశారు.


Also Read: Jaggayyapet Accident: జగ్గయ్యపేటలో ఘోర ప్రమాదం, ఆర్నెల్ల పాప సహా ఐదుగురు మృతి


కుటుంబ సభ్యులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే 


ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న దుగ్గొండి పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుగ్గొండి ఎస్సై నవీన్, నర్సంపేట శాసనసభ్యులు పెడ్డి సుదర్శన్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పోలీసులను అడిగి ప్రమాద విషయాలు తెలుసుకున్నారు.  కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వారికి ధైర్యం చెప్పారు. అలాగే కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని మాటిచ్చారు. 


Also Read: ATM Thieves Nellore: ఈ ఏటీఎం గజ దొంగలు డబ్బులు మాత్రం కొట్టేయరు, మరేం చేస్తారో చూడండి