Warangal Road Acccident: ఆత్మకూరు: హన్మకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మకూరు -కటాక్షపూర్ ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తుంటే జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందడం స్థానికంగా కలచివేస్తోంది. 


ఓ కుటుంబానికి చెందిన వారు ఆదివారం ఉదయం మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి కారులో వెళ్లారు. దర్శనం అనంతరం సాయంత్రం తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. టిప్పర్ వాహనం వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వీరు గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాశీబుగ్గకు చెందినవారని పోలీసులు భావిస్తున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial