లోన్ యాప్ నిర్వహకుల వేధింపులకు మరో ప్రాణం పోయింది. ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ ల వేధింపుల ఆగడాలకు మరో యువకుడు బలి అయ్యాడు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా వారిని అదుపు చేయలేకపోతున్నారు. తాజాగా లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వనపర్తి జిల్లాలో దీపావళి పండుగ రోజున ఆ కుటుంబంలో విషాదం జరిగింది. జిల్లాలోని కొత్తకోటకు చెందిన శేఖర్ ఓ రుణ యాప్ ద్వారా డబ్బు అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు ఈఎంఐల రూపంలో చెల్లించే క్రమంలో ఆలస్యం అయింది. దీంతో రుణ యాప్ కు చెందిన నిర్వహకులు రోజూ ఫోన్ చేసి బాధితుడ్ని వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలోనే కుటుంబసభ్యులు, స్నేహితులకు నగ్న దృశ్యాలు పంపి వేధించడం మొదలు పెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన శేఖర్​ ఆత్మహత్య చేసుకున్నాడు.


రాజమండ్రిలో..
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో లోన్‌ యాప్‌ వేధింపులకు యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ధవళేశ్వరం సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ పలు లోన్‌యాప్‌ల నుంచి అప్పు తీసుకున్నాడు. అయితే క్రమం తప్పకుండా తీసుకున్న లోన్ లను తిరిగి చెల్లిస్తున్నాడు. అయితే లోన్‌ తిరిగి చెల్లించినప్పటికీ ఇంకా కట్టాలని లోన్‌ యాప్‌ నిర్వాహకులు వేధింపులు స్టార్ట్ చేశారు. అప్పు చెల్లించినా వేధింపులు ఆగకపోవడంతో శ్రీనివాస్‌ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపులతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. లోన్‌ యాప్‌ లో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించినా వేధించడంతో శ్రీనివాస్‌ను  ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ మంగాదేవి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు.  


మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లి పీఎస్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న రాజేష్(35) అనే వ్యక్తి లోన్ యాప్ లో అప్పు తీసుకున్నాడు. డబ్బు కడుతున్నప్పటికీ ఇంకా ఎక్కువ కట్టమని యాప్ నిర్వాహకులు వేధింపులు మొదలుపెట్టారు. అధిక మొత్తంలో డబ్బులు కట్టకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించేవారు. రోజురోజుకీ ఆ బెదిరింపులు అధికం అవ్వడంతో రాజేష్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో  ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేష్ భార్య విజయవాడకు వెళ్లినట్లు తెలుస్తోంది. మృతుడికి మూడు సంవత్సరాల పాప ఉంది. రాజేష్ బిగ్ బాస్కెట్ లో ఒక నెల క్రితం ఉద్యోగంలో చేరినట్టు సమాచారం. 


వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య
రాజేష్ కు అతడి భార్య ఫోన్ చేయగా ఎంతకూ లిఫ్ట్ చేయకపోవడంతో వాచ్ మెన్ కు ఫోన్ చేసి ఇంట్లోకి వెళ్లి  చూడాల్సిందిగా కోరింది. వాచ్ మెన్ వెళ్లి చూసేసరికి రాజేష్ ఫ్యాన్ కు ఉరివేసుకున్న ఆత్మహత్య చేసుకున్నాడు. వాచ్ మెన్ వెంటనే బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇంట్లోని ఓ బోర్డుపై "నేను యాప్ లోన్ తీసుకొని డబ్బు కడుతున్నప్పటికీ నన్ను రోజూ అసభ్యపదజాలంతో బాధ పెడుతున్నారు. నేను ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని" రాజేష్ రాశాడు. ఈ యాప్ నిర్వహికులపై ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని, వేరే వాళ్లు తన లాగ బలి కాకుండా రక్షించాలని రాజేష్ సూసైడ్ నోట్ లో రాశాడు.