Vizianagaram News : ప్రియురాలి కోసం ఆమె నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు యువకుడు. ఇంతలో బయట నుంచి ఏదో అలికిడి విని కిటికిలో నుంచి దిగి తప్పించుకునే ప్రయత్నంలో మూడో అంతస్తు నుంచి దూకడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయనగరం తోటపాలెం సమీపంలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
విజయనగరంలో నివాసం ఉంటున్న ఆర్ఎస్ నాయుడు(25) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఇంటర్ చదివే సమయంలో ఒక అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆమెకు ఒక ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకునితో ఆరేళ్ల కిందట వివాహమైంది. ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది. వేరొకరితో ఆమెకు వివాహమైనా అతడు పాత పరిచయం కొనసాగిస్తూ వచ్చాడు. ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న ఆమె సోమవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చింది. ఇంతలో నాయుడు ఆమె ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుండగా, ఆమె భర్త ఇంటికి వచ్చాడు. దాంతో భయాందోళనలకు గురైన అతడు బాల్కనీలోకి వెళ్లి అక్కడ నుంచి కిందికి దిగే ప్రయత్నంలో జారి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయాడు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ సీఐ వెంకటరావు తెలిపారు.
లవర్ కోసం కొట్టుకున్న యువకులు
ఇటీవల హైదరాబాద్‌లో లవర్ కోసం నవీన్ అనే స్నేహితుడిని హరిహరకృష్ణ అనే యువకుడు హత్య చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా అలాంటి ఘటనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగింది. కానీ ఇక్కడ హత్య జరగలేదు. కేవలం గొడవ జరిగింది, అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఓ అమ్మాయి ప్రేమ విషయంలో ఇద్దరు యువకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తన ప్రియురాలు వెంటపడుతున్నారన్న అనుమానంతో హర్షవర్ధన్ అనే యువకుడి స్నేహితులను అరవ జయకృష్ణ అనే మరో యువకుడు బెదిరించాడు. పట్టణంలోని భ్రమరాంబ సినిమా థియేటర్ వద్ద హర్షవర్ధన్, అరవ జయకృష్ణ మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానిక పోలీసుస్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.
పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కొందరు చెల్లాచెదరైపోయారు. వెంటనే గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రినుంచి వారు పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తాను ప్రేమించిన అమ్మాయికి మరో యువకుడు చూస్తున్నాడనే అనుమానంతో ఈ గొడవ మొదలైంది. అయితే వారిది కేవలం అనుమానమేనా, ఇద్దరూ నిజంగానే ఒకే అమ్మాయిని ప్రేమించారా, అసలు ఆ అమ్మాయి ఈ ఇద్దరిలో ఒకరినైనా ప్రేమిస్తుందా అనే విషయం మాత్రం తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.