Court rejects Swamy Poornanda bail plea:
విశాఖ: మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో పూర్ణానంద స్వామీజీకి మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఇద్దరు మైనర్ బాలికల పై అత్యాచారం కేసులో పూర్ణనంద స్వామీజీ తరపున వేసిన బెయిల్ పిటిషన్ ను విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు మూడోసారి కొట్టి వేసింది. మరికొన్ని మెడికల్ టెస్ట్ రిపోర్టులు పెండింగ్ లో ఉన్నట్టు స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణ జడ్జికి తెలియజేశారు. ఒకవేళ స్వామీజీకి బెయిల్ మంజూరు చేస్తే బాధితులను బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పీపీ కరణం బలరాం వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ మరోసారి కొట్టివేసింది.
జ్ఞానానంద, రామానంద ఆశ్రమం (సాధు మఠం) ఆశ్రమంలో బాలికలపై లైంగిక వేధింపుల కేసును విశాఖ పోక్సో కోర్టు విచారించింది. ఇదివరకే విశాఖ పొక్సో కోర్టు పూర్ణానంద వేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించగా మరోసారి ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇద్దరు బాధిత మైనర్ బాలికలు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్లో పూర్ణానంద స్వామిని గుర్తించారు. బాధిత బాలికలు నిందితుడు స్వామీజీని గుర్తించడంతో పోక్సో కోర్టు ఇదివరకే రెండు పర్యాయాలు ఆయనకు బెయిల్ తిరస్కరించింది. ఆయనకు బెయిల్ ఇస్తే బాధిత బాలికలకు ప్రాణహాని ఉందని, సాక్ష్యాలు సైతం మాయం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు లాయర్ కోర్టుకు విన్నవించడంతో ఆయన పిటిషన్ వచ్చిన ప్రతిసారి పోక్స్ కోర్టు బెయిల్ ను తిరస్కరిచింది.
పూర్ణానంద సరస్వతి స్వామీజీ మైనర్ బాలికలతో పశువుల నిర్వహణ పనులు చేయించేవారని చైల్డ్ వేల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు ఇటీవల తెలిపారు. కానీ అభంశుభం తెలియని బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడి హింసించేవారని ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఉండాలంటే భయంగా ఉందని ఆశ్రమం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన 13 ఏళ్ల బాలికను కాళ్లకు గొలుసులు కట్టి పనులు చేయిస్తూ వేధించారు. ఓసారి గొలుసు తీయడంతో ఆశ్రమంలో పనిచేసే మహిళ సహకారంతో పారిపోయింది.