భూ విక్రయాల విషయంలో తమతో వివాదాలు ఏర్పడ్డ ఒక వ్యక్తిపై హత్యాయత్నానికి పురిగొల్పారన్న ఆరోపణలతో విశాఖపట్నం క్రైమ్ ఎస్సై నాగమణిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె సోదరి, భీమిలి మేజిస్ట్రేట్ విజయలక్ష్ష్మి డ్రైవర్ అప్పల రెడ్డిని కూడా పోలీసులు రిమాండ్ కు తరలించారు. అక్కాచెల్లెళ్లు అయిన విజయ లక్ష్మి, నాగమణిలో ఒకరు భీమిలి మేజిస్ట్రేట్ కాగా మరొకరు విశాఖలో క్రైమ్ ఎస్సై. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి తో భూ విక్రయాల విషయంలో విజయలక్ష్మికి వివాదాలు ఏర్పడ్డాయి. ఈ విషయం విజయలక్ష్మి తన సోదరి నాగమణికి చెప్పడంతో ఆయనపై ప్రతీకారానికి ప్రణాళిక చేశారు.
క్రైమ్ కానిస్టేబుల్ ప్రమోద్ సహకారంతో కూర్మాన రామస్వామి, రాజు అనే వన్ టౌన్ కి చెందిన వ్యక్తులతో పాటు భీమిలికి చెందిన మరో వ్యక్తితో కలిసి సుపారీ మాట్లాడారనేది ఆరోపణ. జూన్ 19 న రాజేష్పై పైన పేర్కొన్న వ్యక్తులు దాడి చేయగా రాజేష్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో తప్పించుకోగలిగాడు. తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైన రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కుట్రకోణం బయటపడింది. దానితో హత్యాయత్నం 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏకంగా ఒక మేజిస్ట్రేట్, ఒక క్రైమ్ ఎస్సైల పైనే ఆరోపణలు రావడంతో పక్కాగా దర్యాప్తు చేశారు.
ఈ హత్యాయత్నంతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, మేజిస్ట్రేట్ కారు డ్రైవర్ అప్పల రెడ్డి, SI నాగమణి మాత్రం ఇంతకాలం పరారీలోనే ఉన్నారు. అనేక మార్లు విచారణ జరిపిన పోలీసులు చివరకు నాగమణి, అప్పల రెడ్డిలను ఒడిశాలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మేజిస్ట్రేట్ విజయలక్ష్మి విషయం మాత్రం ఇంకా బయటకి రాలేదు. ఆమె ఇంకా పరారీలోనే ఉన్నట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు, రేపట్లోగా పోలీసులు ఈ ఘటనపై అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు. అయితే ఏకంగా ఒక క్రైమ్ మహిళా ఎస్సై పైనే ఇలాంటి ఆరోపణలు రావడంతో పాటు ఒక మహిళా జడ్జిపై కూడా హత్యాయత్నానికి ప్రోత్సహించిన ఆరోపణలు రావడం విశాఖపట్నంలో సంచలనం సృష్టించింది.