Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ గ్యాంగ్ వార్‌లకు, హత్యలకు అడ్డాగా మారిందని ఎప్పటినుంచో విమర్శలున్నాయి. పాతబస్తీ ప్రాంతాల్లో ఏదో ఓ నేరం వెలుగుచూస్తూనే ఉంటోంది. గత రాత్రి కూడా పాతబస్తీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతి చెందిన వ్యక్తిని నజీర్ అహ్మద్ గా గుర్తించారు పోలీసులు. నజీర్ అహ్మద్.. రెండేళ్ల క్రితం జహీరాబాద్ లో విశాల్ షిండే అనే యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు. విశాల్ షిండే హత్య కేసులో నజీర్ అహ్మద్ సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు నజీర్ అహ్మద్.
కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్ లో నజీర్ అహ్మద్ ను కొందరు దుండగులు హత్య చేశారు. ఈ హత్యకు పాతకక్షలే కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
ఛత్రినాక పోలీసు స్టేషన్ పరిధిలోని ఉప్ గూడ శివాజీ నగర్ ప్రాంతానికి చెందిన విశాల్ షిండే అనే 22 ఏళ్ల యువకుడు సెప్టెంబర్ 2020, 29న మొదట అదృశ్యానికి గురై ఆ తర్వాత హత్యకు గురైన విషయం తెలిసిందే. విశాల్ షిండే కనిపించడం లేదని అతని తల్లి కల్పన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సెప్టెంబర్ 30, 2020వ తేదీన ఛత్రినాక పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు 2020 అక్టోబర్ 1వ తేదీన జహీరాబాద్ అడవుల్లో విశాల్ షిండే హత్యకు గురి అయినట్లు సమాచారం అందింది.
పోలీసులు జహీరాబాద్ ప్రాంతానికి చేరుకుని విశాల్ షిండే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాల్ షిండే మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో నజీర్ అహ్మద్, జహీర్ సహా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
28 ఏళ్ల నదీమ్ తాహే రియల్ ఎస్టేట్ వ్యాపారి. అయితే ఇతడు నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన వాడు. సోదరి భర్త ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతడి తల్లిదండ్రులు టోలిచౌక్ లోని వారి నివాసానికి వచ్చి ఉంటున్నారు. ఈక్రమంలోనే కొద్ది రోజుల క్రితం అతడి సోదరుడుతో పాటు నదీమ్ కూడా సోదరి ఇంటికి వచ్చారు. మంగళవారం రాత్రి టీ తాగేందుకు స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు ఫోన్ చేశాురు. ఫోన్ ఎత్తిన నదీమ్ తాహే.. ఓ దాబాలో భోజనం చేస్తున్నాను, త్వరగానే ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. అలా చెప్పి చాలా సమయం గడుస్తున్నా నదీమ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు మరోసారి ఫోన్ చేశారు. అయితే నదీమ్ మాత్రం ఫోన్ లేపలేదు. ఇలా ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు.
ఈరోజు ఉదయం అబ్దుల్ నదీమ్ హత్యకు గురయ్యాడంటూ... పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. రాత్రి తమతో చక్కగా మాట్లాడిన కుమారుడిని ఇంత దారుణంగా హత్య చేయడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి అబ్దుల్ ఖయ్యూం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.