Visakhapatnam Son Suicide: అప్పటిదాకా నవ్వుతూ తల్లితో సరదాగా గడిపిన ఆ కుమారుడు నిమిషాల వ్యవధిలోనే శవంగా మారాడు. చిరు నవ్వులు చిందిస్తున్న అతను కొద్ది నిమిషాల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడని వారు అస్సలు ఊహించనేలేదు. కుమారుడిని ఆ స్థితిలో చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ కు గురై రోదించింది. అంతకుముందు అమ్మతో టీ పెట్టించుకొని తాగిన అతను ఊహించని రీతిలో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన విశాఖపట్నంలో జరగ్గా, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మానసిక ఒత్తిడే యువకుడి మరణానికి కారణమని తెలుస్తుంది.


పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రేటర్ విశాఖపట్నం (Visakhapatnam) మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని 62వ వార్డులొ అల్లూరి సీతారామరాజు కాలనీ (ASR కాలనీ) ప్రాంతంలో గట్ట రాజేష్‌ అనే 25 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. బుధవారం అతను తన తల్లిని టీ చేయమని అడిగాడు. తల్లి ఇచ్చిన టీ తాగాడు. సరే మమ్మీ బాయ్‌ అన్నాడు.. అంతలోనే తన గదిలోకి వెళ్లి తల్లి చీరతోనే ఊరి వేసుకుని మృతి చెందాడు. అంత వరకు సరదాగా గడిపిన కుమారుడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడంతో ఆ తల్లి గుండె పగిలేలా రోదించింది. 


రాజేష్‌ తన స్నేహితుల కోసం తెలిసిన వారి వద్ద కొంత అప్పు చేశాడు. మరోవైపు, అతని తండ్రి సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. అందుకోసం ఇంటి అవసరాలు తీరడానికి ఇంకా కొంచెం అప్పు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు పదే పదే డబ్బులు అడిగేవారు. దాంతో ఒత్తిడిని భరించలేకపోయాడు. వేరే దారి లేక చనిపోదామని రెండు వారాల క్రితం నిర్ణయించుకున్నాడు. దీంతో రాజేష్‌ దిగాలుగా  ఉండేవాడు. ఇది గుర్తించిన తల్లి స్థానికంగా ఓ పాస్టర్‌ వద్దకు తీసుకువెళ్లి ఆయనతో మాట్లాడించి కౌన్సెలింగ్ ఇప్పించింది. అయినా ఫలితం లేకుండా పోయింది.


బుధవారం (సెప్టెంబరు 28) సాయంత్రం 5 గంటల సమయంలో రాజేష్ తల్లిని టీ అడిగాడు. తల్లి చేతితో ఇచ్చిన టీని రాజేశ్ తాగిన రాజేష్‌ తన గదిలోకి వెళ్లేముందు బై బై మమ్మీ అని చెప్పాడు. ఇంట్లోకి వెళ్లేందుకు బైబై చెబుతావు ఏంట్రా అని ప్రశ్నించింది. దానికి నవ్వుతూ గదిలోకి వెళ్లి పోయిన రాజేష్‌  తల్లి చీరతో ఫ్యాన్‌ హుక్కుకు ఊరిపోసుకున్నాడు. ఆ సమయంలో తండ్రి విధుల నుంచి వచ్చి రాజేష్‌ ఏడి అని అడిగాడు. ఈ క్రమంలో గది వద్దకు వెళ్లగా వేలాడుతున్న కుమారుడిని చూసి కేకలు వేయడంతో తల్లి అక్కడకు చేరుకుంది. 


ఇద్దరూ కిందకి దించి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం దక్కలేదు. దీంతో వారు మల్కాపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం చేయడం కోసం కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా మల్కాపురం పోలీసులు వెల్లడించారు.