అమెరికాలో దుండగుల కాల్పుల్లో విశాఖకు చెందిన తెలుగు విద్యార్థి చట్టూరి సత్యకృష్ణ మరణించారు. సత్యకృష్ణను దుండగులు తుపాకీతో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. నెలరోజుల క్రితమే ఉన్నత విద్య కోసం సత్యకృష్ణ అమెరికాకు వెళ్లారు. సత్యకృష్ణ భౌతికకాయాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ సాయం అందించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.
నెల రోజుల క్రితమే అమెరికాకు వెళ్లిన సత్యకృష్ణ
చిట్టూరి సత్య కృష్ణ(27) అమెరికా అలబామాలోని పాత బర్మింగ్‌హామ్ హైవేలోని క్రౌన్ సర్వీస్ స్టేషన్‌లో స్టోర్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులు జరపగా సత్య కృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష చేస్తున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. సత్యకృష్ణ నెల రోజుల క్రితమే అమెరికా వెళ్లారు. అతని భార్య నిండు గర్భవతి అని సమాచారం. కృష్ణ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హత్యకు పాల్పడిన నిందితుడి ఫొటోలను అమెరికా పోలీసు శాఖ విడుదల చేసింది. అనుమానితుడు నల్లటి చొక్కా ధరించి ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాడని కలేరా నగర పోలీసు విభాగం అధికారులు తెలిపారు.
ఇటీవల వర్జీనియాలో కాల్పులు
ఆమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో హుక్కా లాంజ్‌లో ఇటీవల కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వర్జీనియా టెక్ సమీపంలోని హుక్కా లాంజ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయని బ్లాక్స్‌బర్గ్ పోలీసులు వెల్లడించారు. మొత్తం ఐదుగురిపై దుండగులు కాల్పులు జరిపారని తెలిపారు. అయితే వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరు పరిస్థితి విషమించి మృతి చెందారు. మరో నలుగురికి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరు వర్జీనియా టెక్ విద్యార్థి అని యూనివర్సిటీ ప్రెసిడెంట్ టిమ్ సాండ్స్ వెల్లడించారు. కాల్పుల కారణంగా అనేక గంటలపాటు వర్జీనియా టెక్ యూనివర్శిటీ ప్రాంతంలో లాక్‌డౌన్ విధించారు. గత శనివారం తెల్లవారుజామున 3:18 గంటలకు క్యాంపస్ సురక్షితంగా ఉందని పోలీసులు ప్రకటించారు. ఏప్రిల్ 2007లో వర్జీనియా టెక్ వద్ద జరిగిన కాల్పుల్లో 32 మంది మృతి చెందారు. అయితే వారి మరణానికి గుర్తుగా ఏర్పాటు చేసిన స్మారక చిహ్నానికి ఒక మైలు సమీపంలోనే తాజాగా కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనపై పలు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి.
Also Read: జూనియర్ ఆర్టిస్టుల్లా బిచ్చమడిగారంటూ చిరంజీవి, మహేష్ బాబుపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్