Viral Video: 



యూపీలో ఘటన...


దొంగతనం చేశారన్న అనుమానంతో యూపీలో ఇద్దరు మైనర్లను చిత్రహింసకు గురి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. వాళ్లతో బలవంతంగా మూత్రం తాగించారు. చెప్పలేని చోట కారం రాసి హింసించారు. ఆ తరవాత ఇంజెక్షన్‌లూ ఇచ్చారు. బాధితుల్లో ఒకరి వయసు 10 ఏళ్లు కాగా మరొకరి వయసు 15 ఏళ్లు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. పచ్చిమిరపకాయలు నోట్లో పెట్టి బలవంతంగా తినిపించారు. ఓ బాటిల్‌లో యూరిన్ పోసి వాళ్లతో తాగించారు. తాగకపోతే ఇంకా గట్టిగా కొడతామంటూ బెదిరించారు. డబ్బులు దొంగిలించారన్న అనుమానంతో ఇంత రాక్షసంగా ప్రవర్తించారు. ఇద్దరి చేతులను వెనక్కి కట్టేసి తలను నేలకు ఆనించారు. వెనక నుంచి కారం పెట్టి రాక్షసానందం పొందారు. ఆ మంటను తట్టుకోలేక బాధితులు కేకలు పెడుతున్నా వదల్లేదు. ఆగస్టు 4న ఓ చికెన్ షాప్‌లో ఈ ఘటన జరిగినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ వీడియో పోలీసుల వరకూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమై నిందితులపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆరుగురు నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు. 


మధ్యప్రదేశ్‌లో..


మధ్యప్రదేశ్‌లో ఇటీవలే దారుణమైన ఘటన వెలుగుచూసింది. యువకుడిని తన కాళ్లు నొక్కాలని ఓ వ్యక్తి చితకబాదాడు. అంతటితో ఆగకుండా తన కాళ్లు నాకాలంటూ చిత్రహింసలు చేసి చివరికి యువకుడితో కాళ్లు నాకించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడిని కొంత మంది యువకులు కారులో వెళ్లి కిడ్నాప్ చేశారు. కారులో ఎక్కించుకున్న యువకుడిని చిత్రహింసలు పెట్టారు. బలవంతంగా కారులోకి ఎక్కించుకుని కదులుతున్న కారులోనే అతనిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ యువకుడి ముఖంపై చెప్పులతో కొట్టారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, పిడిగుద్దులతో యువకుడిని చిత్రహింసలు పెట్టారు. ఆపై ఆ యువకుడితో తమ కాళ్లు నాకించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలను ఆ కారులోనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.యువకుడి పట్ల దాష్టీకం ప్రదర్శించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటన జూన్ 30వ తేదీన జరిగగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, నిందితులు అందరూ గ్వాలియర్ జిల్లాలోని దబ్రా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటన తర్వాత బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


మరో ఘటన..


మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఇటీవల ఓ ఆదివాసిపై బీజేపీ నేత అనుచరుడు మూత్ర విసర్జన చేసిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా.. నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసి.. ఇంటిని కూల్చి వేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌.. బాధితుడిని తన నివాసానికి ఆహ్వానించారు. జరిగిన ఘటనకు సీఎం ఆ ఆదివాసీ యువకుడికి క్షమాపణలు చెప్పారు. అంతటితో ఆగకుండా ఆదివాసీ యువకుడి కాళ్లు కడిగి ఆ నీటిని తలపై చల్లుకున్నారు. 


Also Read: జోధ్‌పూర్ కుర్రాడిని పెళ్లాడిన పాకిస్థాన్ యువతి, వీసా రాలేదని వర్చువల్‌గానే వివాహం