Software Engineer Suicide: రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, లక్షల్లో జీతం మొత్తానికి వారిది అందమైన కుటుంబం. అయితే వారిని చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో ? షేర్ మార్కెట్ రూపంలో నాలుగు జీతాలను బలితీసుకుంది. షేర్ మార్కెట్ సుడిలో చిక్కుకుని బెంగళూరులో ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్య ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి చెందిన 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వీరార్జున విజయ్‌ (31), భార్య హైమావతి (29), ఇద్దరు పిల్లలు మోక్ష మేఘనయన(2) అనే రెండున్నరేళ్ల పాప, సృష్టి సునయన (6 నెలలు)కలిసి బెంగళూరు, సిగేహళ్లిలోని ఓ అపార్టుమెంట్లో ఉంటున్నారు. విజయ్ ఓ ఐటీ కంపెనీలో టీంలీడర్‌గా పనిచేస్తున్నాడు. జీతం కూడా పెద్ద సంఖ్యలోనే వస్తుంది. జులై 31న ఇంట్లో అందరూ విగతజీవులుగా కనిపించారు. భార్యా పిల్లలను చంపి విజయ్ ఆత్మహత్య చేసుకున్నారు. 


ఈ ఘటన బెంగళూరులో సంచలనంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. వారి ఫ్లాట్‌లో లభించిన ల్యాప్‌టాప్‌ను పరిశీలించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. విజయ్ కుటుంబం విషాదాంతం వెనుక ఓ షేర్‌మార్కెట్‌ భూతం ఉందని నిర్ధారించారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోవడంతో ఆ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినట్లు తేల్చారు. అతని ల్యాప్‌టాప్, మొబైల్‌ను పరిశీలించిన తరువాత విజయ్ కొన్నేళ్ల షేర్ల మార్కెట్‌లో వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.


షేర్ ‌మార్కెట్‌లో భారీ నష్టాలను చవి చూశాడు. అంతే కాకుండా పోయిన వాటిని రాబట్టుకోవడానికి వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాడు. అయితే మార్కెట్ అస్థిర స్వభావం అతన్ని తీవ్రంగా నష్టపరిచింది. లాభాలు రాకపోగా ఉన్న పొదుపులు మొత్తం ఖాళీ అవడం, అప్పులు తీర్చే మార్గం లేకుండా పోయింది. షేర్ మార్కెట్‌లో తాము జమ చేసుకున్న మొత్తం ఒక్కసారిగా కరిగిపోవడం, అప్పులు చేయడంతో విజయ్ పీకల్లోతు కష్టాల్లో వెళ్లిపోయాడు. ఈ మానసిక వ్యథతో కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాడ్డారని పోలీసులు గుర్తించారు.


కుటుంబసభ్యులను చంపే స్థాయికి అతని మానసిక స్థాతి దిగిజారిపోయిందని తెలిపారు. కుటుంబ సభ్యులకు హత్య చేసి.. చివరగా విజయ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టు దర్యాప్తు అధికారి, బెంగళూరు డీసీపీ లక్ష్మణ్‌ ధ్రువీకరించారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించడంతో శనివారం మచిలీపట్నం బందరు కోటకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.


ఎలా తెలిసిందంటే?
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ డివిజన్‌లోని కడుగోడిలోని సీగేహళ్లిలోని సాయి గార్డెన్స్‌ అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో  విజయ్ కుటుంబంతో ఉంటున్నాడు. హేమావతికి తమ్ముడు శేషసాయి  ఫోన్‌ చేశాడు. ఎంతకూ లిఫ్ట్ చేయకపోవడంతో అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విజయ్ తన ఆర్థిక ఇబ్బందులను తన కుటుంబానికి చెప్పకుండా రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించాడు. అయితే అతని భార్య హేమావతికి విషయం తెలియడంతో షేర్ మార్కెట్ వ్యాపారం వద్దని వారించింది. షేర్లలో పెట్టుబడి పెట్టవద్దని పదే పదే కోరింది. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు కూడా జరిగాయి.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial