Road Accidents : తెలంగాణ వికారాబాద్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ధరూర్ మండలం కేరెల్లి బాచారం వంతెన వద్ద ప్రయాణికులతో వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని వికారాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరొకందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ జమీల్‌, రవి, కిషన్‌, సోనీబాయి చనిపోయారని పోలీసులు తెలిపారు. బాధితులు పెద్దేముల్‌ మండలం మదనంతాపూర్‌ కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. వీరంతా కూలీ పనుల కోసం వికారాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.  


మరో ప్రమాదంలో నలుగురు మృతి 


సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం కన్సాన్‌ పల్లి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.  


ప్రమాదంపై మంత్రి సబితా దిగ్భ్రాంతి


వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండలంలోని కేరెళ్లి-బాచారం వద్ద ఆటోను లారీ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురి మృతి చెందడంపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డితో మంత్రి మాట్లాడారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పెద్దేముల్ మండలం మదనంతాపూర్ తండాకు చెందిన వ్యక్తులు ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. సంఘటనా స్థంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. 


వైసీపీ నేత దుర్మరణం 


తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత దుర్మరణం పాలయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కోలా వెంకటేశ్వర్లు వైసీపీ తరపున జడ్పీటీసీగా ఉన్నారు. ఆయన వెంకటగిరిలో నివాసం ఉంటారు. వెంకటగిరి నుంచి తిరుపతి వెళ్లి, తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి కారులో వెంకటగిరికి వస్తుండగా మార్గ మధ్యంలో రేణిగుంట మండలంలోని మర్రిగుంట వద్ద ప్రమాదం జరిగింది. ఇనుప లోడుతో వస్తున్న లారీని ఆయన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో జడ్పీటీసీ కోలా వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. అదే కార్లో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారి చొరవతో.. గాజుల మండ్యం పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతికి తరలించారు. గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పట్ల ఆనం రామనారాయణ రెడ్డి తన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షత గాత్రులకు తక్షణ వైద్యం అందేలా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు..