AP CID On Ayyanna Arrest : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అరెస్టు ఏపీలో సంచలనం రేపింది. అర్ధరాత్రి, గోడ దూకివచ్చి, తలుపులు పగలగొట్టి అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. అయ్యన్న పాత్రుడి అరెస్టుపై ఏపీ సీఐడీ వివరణ ఇచ్చారు. ఎన్‌వోసీ ఫోర్జరీ చేశారనే అభియోగాలతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేసినట్లు సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ స్పష్టం చేశారు. తమది కాని 2 సెంట్ల భూమిని అయ్యన్నపాత్రుడు ఆక్రమించారని తెలిపారు. ఈ కేసులో అయ్యన్నను A1 గా, ఆయన కుమారులు విజయ్ A2, రాజేశ్ A3 గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో సునీల్ నాయక్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నారు. ఫోర్జరీ చేయడం మామూలు విషయం కాదని తెలిపారు. ఐపీసీ 464, 467, 471, 474, రెడ్ విత్ 120-B, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఐజీ సునీల్ నాయక్ స్పష్టం చేశారు.
ఫోర్జరీ పత్రాల కేసు
అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే అభియోగాలపై గురువారం తెల్లవారు జామున నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు విజయ్, రాజేశ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. గోడ దూకి అయ్యన్న పాత్రుడి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అయ్యన్నతో పాటు విజయ్, రాజేశ్ లను విశాఖపట్నంలోని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. సింహాచలం పీహెచ్‌సీలో అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుల అరెస్ట్ ల పై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందునే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు.
ఎంత కబ్జా చేశారనేది ముఖ్యం కాదు
"అయ్యన్నపాత్రుడిపై మాకు ఫిర్యాదు వచ్చింది. విచారణ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం కేసు నమోదు చేశాం. అయ్యన్నపాత్రుడు, విజయ్, రాజేశ్ లపై కేసులు పెట్టాం. అయ్యన్న పాత్రుడుకు రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి ఆధారాలు తారుమారు చేస్తారు అని అరెస్ట్ చేశాం. తెల్లవారు జామున 4 గంటలకు అరెస్ట్ చేశాం. ముగ్గురు కలిపి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఒక ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీ చేశారు. అయ్యన్నపాత్రుడికి సంఘంలో పలుకుబడి ఉంది కాబట్టి సాక్షాలు తారుమారు అవుతాయి అని అరెస్ట్ చేశాం. ఎంత స్థలం కబ్జా చేశారు అనేది మాకు ముఖ్యం కాదు. ఫోర్జరీ చేశారు అనేది మాకు ముఖ్యం. అయ్యన్నపాత్రుడు పై ఫిర్యాదు చేసిన వ్యక్తి మాములు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సీఐడీకి ఫిర్యాదు చేశాడు కాబట్టి మేం అరెస్ట్ చేశాం."- సీఐడీ డీఐజీ సునీల్ నాయక్
Also Read : Ayyanna Patrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టు, బట్టలు మార్చుకోనివ్వకుండా లాక్కుపోయారు - భార్య ఆవేదన