Vikarabad Crime News: వికారాబాద్ జిల్లా కోట్ పల్లి ప్రాజెక్టులో పడి నలుగురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. విహార యాత్ర కోసం వెళ్లి వ్యక్తుల్లో.. ఒకరు ప్రాజెక్టులో పడిపోగా.. కాపాడేందుకు వెళ్లి మరో ముగ్గురు కూడా గల్లంతు అయ్యారు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరో వక్తి కోసం గాలిస్తున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..?
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడకు చెందిన లోకేష్, వెంకటేష్, జగదీశ్, రాజేశ్ లు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు. అయితే వీరంతా విహార యాత్రం కోసం కోట్ పల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ప్రాజెక్టులో పడిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కవగా ఉండడంతో అతడు గల్లంతయ్యాడు. సదరు యువకుడిని కాపాడేందుకు మరో ముగ్గురు యువకులు ప్రాజెక్టులోకి దూకారు. ఇలా నలుగురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు.. వెంటనే అక్కడకు చేరుకుని యువకులను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వారి మృతదేహాలను జాలర్లు బయటకు తీశారు. అయితే మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. యువకుల మృతదేహాలను చూస్తూ.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పండుగపూటే ఒకే కుటుంబానికి చెందిన యువకులు చనిపోవడంతో.. ఊరంతా విషాద ఛాయలు అలముకున్నాయి.