Vijayawada News : విజయవాడ రైల్వేస్టేషన్ లో మూడు సంవత్సరాల బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. మీరావలి, హుస్సేన్ దంపతుల ఏకైక కుమార్తె షాభితను గుర్తుతెలియన మహిళ కిడ్నాప్ చేసింది. ఈ నెల 8వ తేదీన జరిగిన ఈ కిడ్నాప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీరావలి, హుస్సేన్ కూలీ పనులు చేసుకొంటూ రాత్రి పూట ప్లాట్ ఫాంపై నిద్రపోతుంటారు. వారి కుమార్తెను గుర్తుతెలియని మహిళ కిడ్నాప్ చేసింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు రిజిస్టర్ చేసి 3 బృందాలను నియమించారు. రైల్వే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో మహిళను పోలీసులు గుర్తించారు. మహిళ బాలికతో కలిసి నెహ్రూ చౌక్ వద్ద సంచరించినట్లుగా గుర్తించారు. పట్టపగలే బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. బాలిక కిడ్నాప్ దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఆర్​పీఎఫ్ కార్యాలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. గుర్తు తెలియని మహిళ పాపను తీసుకెళ్తున్నట్లు సీసీటీవీల ద్వారా గుర్తించారు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసి మూడు ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు. 


ప్రేమించిన యువతితో పెళ్లి కోసం 


ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఓ యువకుడు విచిత్రమైన పథకం వేశాడు. కిడ్నాప్ డ్రామా ఆడేందుకు ప్లాన్ చేయగా అది కాస్త బెడిసి కొట్టింది. దిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆనంద్ పర్బత్ ప్రాంతంలో ఉండే గౌరవ మిశ్రా సెల్‌ఫోన్ ఛార్జర్ తయారీ యూనిట్‌ నడుపుతున్నాడు. అయితే జూన్ ఏడో తేదీ రాత్రి 11 గంటల సమయంలో గౌరవ్ మిశ్రాను కిడ్నాప్ చేసినట్టు అతని తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారని, ఓ చీకటి గదిలో బంధించారని పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గౌరవ్ మిశ్రా ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు.


కిడ్నాప్ డ్రామా


పోలీసులు ఆధునిక టెక్నాలజీ సాయంతో గౌరవ్ మిశ్రా ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అక్కడికి వెళ్లగా అక్కడ అతను కనిపించలేదు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. దీంతో పోలీసులు అతని తయారీ యూనిట్‌కు వెళ్లి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. గౌరవ్ మిశ్రా ఒంటరిగా రోహ్తక్ రోడ్డు వైపు వెళ్లిన దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి. తర్వాత అతని ఫోన్ ఆన్ అవ్వగా సిగ్నల్స్ బట్టి అతడు ఆనంద్ పర్బత్ సమీపంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దాంతో పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గౌరవ్ మిశ్రాను విచారించిన పోలీసులు అవక్కాయ్యారు. గౌరవ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెను పెళ్లి చేసుకోవడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని పోలీసులకు చెప్పాడు. వారిని పెళ్లికి ఒప్పించేందుకు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలిపాడు. అయితే తల్లిదండ్రులకు, పోలీసులు తప్పుడు సమాచారం అందించినందుకు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.