BRS Incharges In South : భారత రాష్ట్రీయ సమితి పేరుతో జాతీయ పార్టీని ప్రారంభించాలనుకుంటున్న సీఎం కేసీఆర్ ఆ పార్టీకి ఇంచార్జులను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వారిని ప్రగతి భవన్‌కు పిలిచి చర్చలు కూడా జరిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ విషయంలో ఓ స్పష్టతకు వచ్చిన కేసీఆర్ కార్యవర్గంపై కసరత్తు చేస్తున్నారు. అది పూర్తయిన తర్వాత ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ఏ రాష్ట్రానికి ఎవరిని ఇంచార్జ్‌లుగా నియమించే చాన్స్ ఉందంటే ?
ఏపీకి ఉండవల్లి అరుణ్ కుమార్ ?
భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీ కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎంట్రీ కావడం అనివార్యం. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బాధ్యతల్ని ఎవరు చూసుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారింది. అనూహ్యంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నుకేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించి మధ్యాహ్న భోజనం పెట్టి మరీ జాతీయ రాజకీయాలపై చర్చించారు. దీంతో ఆయన ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.జాతీయ రాజకీయాలపై చర్చించిన మాట నిజమేనని.. మరో రెండు వారాల్లో మరోసారి భేటీ జరుగుతుందని ఉండవల్లి కూడా ప్రకటించారు. అంటే .. బీఆర్ఎస్ ఏపీ శాఖ బాధ్యతలు తీసుకోవడానికి ఉండవల్లి ఆసక్తికరంగానే ఉన్నట్లుగా భావించాలి. గతంలో పలుమార్లు తమ పార్టీని ఏపీలో పెట్టాలని చాలా మంది అడిగారని కేసీఆర్ ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా అడుగుతున్నారని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ దాన్ని నిజం చేయబోతున్నారని అనుకోవచ్చు. ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర విభజన చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాడుతున్న లాయర్. అయితేకేసీఆర్ అవన్నీ పట్టించుకోదల్చుకోలేదు. ఉండవల్లి కూడా లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
కర్ణాటకలో ప్రకాష్ రాజ్ !
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ను భారత రాష్ట్ర సమితి కర్ణాటక శాఖకు ఇంచార్జ్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జాతీయ రాజకీయాలపై కేసీఆర్ తో కలిసి ప్రకాష్ రాజ్ ప్రయాణం చేస్తున్నారు. పలుమార్లు సమావేశం అయ్యారు. ప్రశాంత్ కిషోర్‌తో జరిగిన సమావేశాల్లోనూ ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఆయనకు ఇటీవల రాజ్యసభ సభ్యత్వం ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఇవ్వలేదు. భారత రాష్ట్ర సమితి కర్ణాటక బాధ్యతల్ని ప్రకాష్ రాజ్ కు అప్పగించే ఉద్దేశంతోనే రాజ్యసభకు పంపలేదని భావిస్తున్నారు.
తమిళనాడులో విజయ్ అందుకుంటారా ?
తమిళనాడులో కేసీఆర్ జాతీయ పార్టీ ఇంచార్జ్‌గా సినీ నటుడు విజయ్ ఉండే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల విజయ్.. సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనూహ్యంగా విజయ్ ప్రగతి భవన్‌కు రావడంతో ఏదో విశేషం ఉండి ఉంటుంది అనుకున్నారు. అయితే రాజకీయం ఉంటుందని ఎక్కువ మంది ఊహించలేకపోయారు. ఇళయదళపతిగా ఫ్యాన్స్‌లో క్రేజ్ తెచ్చుకున్న విజయ్‌కు రాజకీయ ఆశలు.. ఆకాంక్షలు ఉన్నాయి. ఇటీవల ఆయన అభిమానులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి కొన్నిచోట్ల మంచి ఫలితాలు సాధించారు. ఈ క్రమంలో కేసీఆర్ భారత రాష్ట్ర సమితికి ఆయనను ఇంచార్జ్ గా ఉండేందుకు అంగీకరింపచేసేందుకు చర్చలు పిలిచి ఉండవచ్చని భావిస్తున్నారు.
వారంతా అంగీకరించడమే కీలకం !
కేసీఆర్ దృష్టిలో దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జులుగా ఉండవల్లి, ప్రకాష్ రాజ్, విజయ్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అయితే వారు ఈ బాధ్యతలకు అంగీకరిస్తారా లేదా అన్నదే కీలకం. ఈ అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.