Vijayawada News: ధర్మవరం చీరల వ్యాపారులపై బెజవాడలొ కొందర వ్యక్తులు విచక్షణ రహితంగా ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి. చీరలు అమ్మిన బకాయి సొమ్ము అడగటానికి వచ్చిన ఇద్దరు వ్యాపారులను నిర్బంధించి ఇబ్బందులకు గురిచేశారని వీడియోలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


డబ్బు బకాయి విషయంపై వ్యాపారుల మధ్య వివాదం తలెత్తగా.. కోపంతో ఊగిపోయిన బెజవాడ వస్త్ర దుకాణ వ్యాపారి విచక్షణ మరిచాడని చెబుతున్నారు. ఇద్దరు ధర్మవరం చీరల వ్యాపారుల బట్టలు ఊడదీసి దాడి చేశారని సమాచారం. అంతటితో ఆగకుండా నగ్నంగా ఉన్న ఇద్దరు వ్యాపారులను వీడియోలు తీశారని కూడా అంటున్నారు. ఆపై వీడియోలను ధర్మవరంలో వ్యాపారులకు పంపించి వికృతంగా ప్రవర్తించాడట.


అలా ఆ వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియోల ద్వారా విషయం తెలుసుకున్న బెజవాడ ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.. బెజవాడ వ్యాపారి ఆగడాలపై ఆరా తీస్తున్నారు.


అసలు ఏం జరిగింది, ఇంత దారుణంగా బట్టలు ఊడదీసి కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుంటున్నారు అధికారులు. కొట్టడమే కాకుండా నగ్నంగా వీడియోలు తీసి వాటిని ఇతర వ్యాపారులకు ఎందుకు పంపించారని అడుగుతున్నారు. ఇందులో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి వారిని శిక్షించాలని కోరుతున్నారు.