సంచలనం రేపిన ఫాతిమా అనే విజయవాడ యువతి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరంపూర్ కోర్టు అనుమతితో ఏపీ పోలీసులు ఇద్దరు నిందితులు వాసిమ్‌, తయ్యబ్‌లను ఇవాళ విజయవాడకు తీసుకువచ్చారు. జులై 10వ తేదీన విజయవాడలోని తన ఇంటి నుంచి వెళ్లిన ఫాతిమా కనిపించకుండా పోయింది. ఫాతిమా ఆచూకీ కోసం కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులకు నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని తెలిసింది. ప్రేమ పేరుతో మోసం చేసి ఫాతిమాను ఉత్తరప్రదేశ్‌కు రప్పించుకున్న నిందితులు ఆమె నుంచి డబ్బు, బంగారం కాజేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫాతిమాను వీరిద్దరే హత్య చేశారా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుపై పూర్తి విచారణకు నిందితులను విజయవాడ తీసుకువచ్చారు. 


వైద్యం పేరుతో వంచన


ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డకు ఆరోగ్యం బాగోలేదని, నయం చేయడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు వ్యక్తుల్ని పిలిపించింది విజయవాడకు చెందిన ఓ కుటుంబం. వాళ్లే ఆ యువతి పాలిట రాక్షసులుగా మారారు. ప్రేమ పేరుతో నయవంచన చేసి చివరకు ఆ యువతిని హత్య చేశారు. విజయవాడ వన్ టౌన్ కు చెందిన నజీర్ అహ్మద్‌కు ఐదుగురు ఆడపిల్లలు. తన రెండో కుమార్తె ఫాతిమా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఎంతో మంది వైద్యులకు చూపించిన ఫలితం లేకపోవడంతో తన స్నేహితుల సహాయంతో ‌ఉత్తరప్రదేశ్‌లో భూతవైద్యలను ఆశ్రయించారు. దీంతో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన భూతవైద్యలు 10 రోజులు ఉండి ఫాతిమాకు అతీత శక్తులు ఆవహించాయని నమ్మబలికారు. చివరకు ఏవో పూజలు చేసి దుష్టశక్తులను వదిలించామన్నారు. 


బంగారం తీసుకొని హత్య


ఈ పరిచయంతో ఉత్తరప్రదేశ్ నుండి ప్రతిరోజు ఫాతిమాకు ఫోన్ చేసి ఆ భూతవైద్యులు మాట్లాడుతుండేవారు. వారి మాయ మాటలు నమ్మి గత నెల 9వ తేదీన కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఫాతిమా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తన వెంట తీసుకెళ్లింది. కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారిని విచారించినా ఫలితం లేకపోయింది. చివరకు విజయవాడలోని కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫాతిమా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ఈ కేసు దర్యాప్తుపై ఉత్తరప్రదేశ్ వెళ్లిన పోలీసులకు భూతవైద్యం చేసిన వాసిఫ్, తయ్యబ్ కనిపించారు. స్థానిక పోలీసుల సాయంతో తమదైన శైలిలో విచారించగా, 15 సవార్ల బంగారం తీసుకుని ఫాతిమాను హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఉత్తరప్రదేశ్ సహరంపూర్ నుంచి ఇద్దరు నిందితులను స్థానిక కోర్టు అనుమతితో విజయవాడ తీసుకువచ్చిన పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. 


Also Read: Medak Car Fire: అటవీ ప్రాంతంలో తగలబడిన కారు... డిక్కీలో చూస్తే రియల్టర్ డెడ్‌బాడీ... మెదక్‌లో ఆందోళన కలిగించిన సంఘటన