విజయవాడలో ఓ వ్యక్తి కారు ఢీకొని చనిపోవడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. తొలుత అది రోడ్డు ప్రమాదం అని భావించినా, బాధిత కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలతో కేసు మరో మలుపు తిరిగింది. హతుడితో గతంలో గొడవలు జరిగిన వ్యక్తి పగ తీర్చుకునేందుకు కారుతో గుద్ది చంపాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, వీరిద్దరూ వైఎస్ఆర్ సీపీలో కింది స్థాయి కార్యకర్తలు. వైఎస్ఆర్ సీపీ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్ ఫాలోవర్లుగా పోలీసులు చెబుతున్నారు.
విజయవాడలో తన భర్త సురేష్ ని, చౌడేష్ అనే మరో వ్యక్తి కారుతో ఢీకొట్టి చంపాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలివి.. చనిపోయిన వ్యక్తి దేశి సురేష్ విజయవాడ ఐదో డివిజన్ వైసీపీ యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. శనివారం రాత్రి 7 గంటల టైంలో సురేష్ తన కుమారుడికి ఐస్ క్రీమ్ తేవడం కోసం విజయవాడలోని క్రీస్తురాజ పురంలోని తన ఇంటినుంచి బయటకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో వైసీపీకి చెందిన మరో నాయకుడు కంకణాల చౌడేష్ నలుగురు మిత్రులతో కలిసి కారులో తిరుగుతున్నారు. అప్పుడే నడుచుకుంటూ వెళ్తున్న సురేష్ వీరి కంట పడ్డాడు. సురేష్‌ను మద్యం మత్తులో వాహనం నడుపుతున్న చౌడేష్ ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లాడు. చుట్టుపక్కల ఉన్న వారు కేకలు వేయడంతో నిందితులు అదే కారులో ఉడాయించారు. స్థానికులు సురేష్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
ఇద్దరి మధ్య గొడవలు
సురేష్ మచిలీపట్నం ఆర్టీవో ఆఫీసులో డ్రైవరుగా పని చేస్తున్నాడు. నిందితుడిగా భావిస్తున్న చౌడేష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో వైఎస్ఆర్ సీపీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాడు. 2020లో స్థానికంగా ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సురేష్, తన ఫ్రెండ్స్ కలిసి చౌడేష్‌ను అతడి కుమారుడి ఎదుటే కొట్టాడు. దీనిపై మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయింది. కోర్టులో ఈ కేసు విచారణ నడుస్తుందని సురేష్ భార్య శిరీష మీడియాతో అన్నారు.
ఆ దాడిని అవమానంగా భావించిన చౌడేష్ ఆత్మహత్యకు కూడా యత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ కేసుపై రాజీకి రావాలని రాజకీయ పెద్దలు సూచించినా చౌడేష్ అందుకు ఒప్పుకోలేదు. ఆ ప్రతీకారంతోనే తాజాగా హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
తమ కుటుంబ పెద్దగా ఉన్న సురేష్ చనిపోవడంతో భార్య, తల్లి కన్నీరుమున్నీరు అవుతున్నారు. తన కుమారుడికి ఐస్ క్రీం తెచ్చేందుకు వెళ్లిన సురేష్ ను పథకం ప్రకారమే చౌడేష్ హత్య చేశారని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఎన్ని గొడవలు ఉన్నా చంపుకోవడం ఏంటని కన్నీరుమున్నీరయ్యారు. ఇక తమ కుటుంబానికి దిక్కు ఎవరని వాపోయారు.
Also Read: IRCTC Update: రైల్వే ప్రయాణికులకు షాక్, నేడు దేశ వ్యాప్తంగా 115 రైళ్లు రద్దు - పూర్తి వివరాలు