Uttarkashi Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లా దుమ్టాలో ఓ బస్సు లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 28 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. గాయపడిన 6 మందిని ఆసుపత్రికి తరలించారు. బస్సులో 28 మంది ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ ఏఎన్‌ఐకి తెలిపారు. ఇప్పటి వరకు 22 మృతదేహాలను వెలికి తీయగా, గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. 














దుమ్టాలో యమునోత్రి జాతీయ రహదారిలో 28 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 6 గురికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల ఘటనా ప్రదేశానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్‌కు చెందిన యాత్రికులు యమునోత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.






ప్రధాని మోదీ దిగ్భ్రాంతి


బస్సు లోయలో పడిన ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్​ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు సరైన వైద్యంతో పాటు మృతదేహాలను రాష్ట్రానికి తరలించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్ సింగ్​ ధామీకి ఫోన్​ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఉత్తరకాశీలో బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.