ఆస్తి కోసం అన్నదమ్ములు, అక్కాతమ్ముడు, అన్నా చెల్లెల్లు, బంధువుల మధ్య తగదాలు చూస్తూనే ఉన్నాం. అయితే లవర్ ఆస్తి కోసం దారుణంగా పాముతో కరిపించి హతమార్చిన ఘటన ఎప్పుడైనా చూశారా? ఇలాంటి ఘటనలు సినిమాలో తప్ప బయట చూడలేం. కానీ ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘటన గురించి తెలిస్తే మీరు మాత్రం అలా అనుకోరు. ఇద్దరిని ప్రేమించిన ఓ యువతి ఆస్తి కోసం ప్రియుడిని హతమార్చిన ఘటన గురించి తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.


ఉత్తరాఖండ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. సినిమా కథను తలపించేలా ఓ యువతి ప్రియుడిని దారుణంగా హతమార్చింది. డబ్బుకు ఆశపడిన ప్రియురాలు తన కొత్త ప్రియుడితో కలిసి పథకం ప్రకారం పాముతో కరిపించి పాత ప్రియుడిని చంపేసింది.


రామ్ భాగ్ కాలనీకి చెందిన యువ పారిశ్రామికవేత్త అంకిత్ చౌహన్ జులై 15న తీన్ పాన్ రైల్వే క్రాసింగ్ సమీపంలో అతని సొంత కారులో వెనుక సీట్లు శవమై కనిపించాడు. ఊపిరి ఆడక కారులో మృతి చెందినట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్ వారి అంచనాలను తలకిందులు చేసింది. పాము కాటుతో అంకిత్ చౌహన్ చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 


సీసీటీవీ కెమెరాలు, కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంకిత్ చౌహాన్‌కు మహి ఆర్య అనే ప్రియురాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొద్దికాలంగా చౌహాన్, మహి ఆర్య కలిసి ఉంటున్నారు. మహి ఆర్య, దీప్ కంద పాల్ వ్యక్తితో చనువుగా ఉండడం చౌహాన్ గుర్తించాడు. వారి మధ్య సంబంధం ఏంటని నిలదీశాడు. దీంతో అతనిపై కోపం పెంచుకున్న మహి ఆర్య లవర్ చౌహన్ ను హతమార్చేందుకు కంద్ పాల్‌తో కలిసి పథకం రచించింది. చౌహన్ సొమ్ము కాజేయాలని స్కెచ్ వేసింది. 


అనుకున్నదే తడవుగా దీంతో రెండో లవర్‌ను రంగంలోకి దించింది. రకరకాలుగా ఆలోచించి ఎలా చంపితే తమ మీదకు కేసు రాదో ఆలోచించించింది. చివరకు పాము కాటుతో చంపాలని డిసైడ్ అయ్యింది. వెంటనే పాములు పట్టే మంత్రగాడు రమేష్ నాథ్ అనే వ్యక్తి వద్ద మహి ఆర్య పదివేల రూపాయలకు విశేష సర్పాన్ని కొనుగోలు చేసింది. తీన్ పాన్ వద్ద పథకం ప్రకారం చౌహన్ ను అతని సొంత కారులో పాముతో కాటు వేయించి హతమార్చారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు నిందితులు మహి ఆర్య, కందపాల్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సినిమా కథను కల్పించేలా జరిగిన ఈ క్రైమ్ స్థానికంగా కలకలం రేపుతోంది.