కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి రాష్ట్రపతికి, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. తనను పోలీసులు అరెస్టు చేయడం గురించి అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై కక్ష కట్టుకొని అరెస్టు చేయించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అకారణంగా అరెస్టు చేసినందుకు కేసీఆర్‌ను తప్పుపడుతున్నానని, కేసీఆర్ ఒత్తిడి వల్లే పోలీసులు అరెస్టు చేశారని అన్నారు.
ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం కింద తెలంగాణకు 2.5 లక్షల ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఒక కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఈ పథకాన్ని తాను పర్యవేక్షించాల్సి ఉందని చెప్పారు. అందులో భాగంగా తాను పరిశీలనకు వెళ్తుండగా పోలీసులు అడ్డగించి అరెస్టు చేశారని లేఖలో వెల్లడించారు.
ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానని, కేంద్ర మంత్రిగా, ఎంపీగా తాను చేయాల్సిన విధులకు తెలంగాణ ప్రభుత్వం ఆటంకం కలిగించినందుకు గానూ ఈ విషయం మీకు తెలియజేస్తున్నానని లేఖలో రాశారు.
ఛలో బాటసింగారం పిలుపు నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం నుంచి ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి వచ్చిన కిషన్ రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ప్రభుత్వం కడుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను చూసేందుకు బీజేపీ నేతలు ఛలో బాటసింగారం కార్యక్రమానికి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని అప్రమత్తమైన పోలీసులు బీజేపీ లీడర్లను ఎక్కడికక్కడ అడ్డగించారు.
శంషాబాద్‌లో కిషన్ రెడ్డిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు తీరుకు నిరసనగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో ధర్నాకు దిగారు. జోరు వానలోనే రోడ్డుపై బైఠాచింయారు. చివరకు కిషన్ రెడ్డిని ఒప్పించి ధర్నా చేస్తున్నప్రదేశం నుంచి తీసుకెళ్లారు. బలవంతంగా తీసుకెళ్లి ఆయన కాన్వాయ్‌లోని వాహనంలోనే కూర్చోబెట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఆయన్ని తరలించారు.
ఖండించిన ఈటల రాజేందర్
బాటసింగారం వద్ద డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించాలని బీజేపీ నిర్ణయిస్తే జంటనగరాల్లో ఉన్న బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు ఈటల రాజేందర్. ప్రతిసారి అధికార పార్టీకి ఇది అలవాటుగా మారిందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉందని.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమను నిర్బంధించినంత మాత్రాన పోరాటం ఆగదని, కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని అరెస్టులు కొత్తకాదని అభిప్రాయపడ్డారు.