US Billionaire Thomas Lee Death:


థామస్ లీ మృతి..


అమెరికన్ బిలియనీర్ థామస్ లీ (Thomas Lee) ఆత్మహత్యకు పాల్పడ్డారు. 78 ఏళ్ల లీ మన్‌హట్టన్ ఆఫీస్‌లో సూసైడ్ చేసుకున్నారు. న్యూయార్క్ పోస్ట్ ఈ విషయం ధ్రువీకరించింది. ప్రైవేట్ ఈక్విటీ ఇన్‌వెస్ట్‌మెంట్‌లో బిగ్‌షాట్‌గా పేరొందిన థామస్..
ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. మన్‌హట్టన్ ఆఫీస్‌లోని 5వ అవెన్యూలో గురువారం ఉదయం 11 గంటలకు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. తన గన్‌తో కాల్చుకుని చనిపోయినట్టు తెలిపారు. ఆఫీస్ సిబ్బంది ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే...ఆయనను బతికించేందుకు చాలానే ప్రయత్నించినట్టు తెలుస్తోంది. కానీ...అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆఫీస్‌లోని బాత్‌రూమ్‌ ఫ్లోర్‌పై ఆయన అచేతనంగా పడి ఉన్నట్టు ఆయన అసిస్టెంట్ వివరించారు. చాలా సేపటి నుంచి ఉలుకు పలుకు లేకపోవడం వల్ల బాత్‌రూమ్‌లో చూశానని, ఆయన ఫ్లోర్‌పై పడి ఉన్నారని తెలిపారు. నేరుగా తలకు గురి పెట్టుకుని కాల్చుకున్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. థామస్ లీ సన్నిహితుడైన మైకేల్ సిట్రిక్ కీలక విషయాలు వెల్లడించారు. 


"థామస్ మృతితో ఆయన కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రైవేట్ ఈక్విటీ బిజినెస్‌లో పయనీర్ అని మాత్రమే ప్రపంచానికి తెలుసు. కానీ ఆయన గొప్ప భర్త, తండ్రి, తాత, స్నేహితుడు..ఇలా ఎన్నో. ఎవరు అవసరంలో ఉన్నా సరే చలించిపోయే వారు. తన సమస్యలాగే భావించి సాయం చేసే వారు" 


- మైకేల్ సిట్రిక్, థామస్ లీ సన్నిహితుడు



2006లో Lee Equityని స్థాపించారు థామస్ లీ. ఆయనే కంపెనీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. అంతకు ముందు Thomas H. Lee Partners సంస్థకు సీఈవోగా ఉన్నారు. 1974లో ఈ సంస్థను స్థాపించారు. హార్వర్డ్ యూనివర్సిటీ, మ్యూజియం ఆఫ్ జూయిష్ హెరిటేజ్, బ్రాండీస్ యూనివర్సిటీ బోర్డ్‌లలో కీలక సభ్యుడిగా ఉన్నారు. గత 46 ఏళ్లలో థామస్ లీ వందలాది డీల్స్‌లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.