UP Man Wanted Wife To Look Like Nora Fatehi: సినిమా తారలు సన్నగా , నాజూగ్గా ఉంటారు. బోలెడంత మేకప్ వేసుకుంటారు. వాళ్లను వీడియోల్లో చూసి.. తనకూ అలాంటి భార్య కావాలనుకున్నాడు యూపీకి చెందిన వ్యక్తి. కానీ చాన్స్ లేదని తెలుసుకుని తన భార్యనే అలా మార్చాలనుకున్నాడు. ఆ క్రమంలో భార్యను చిత్రహింసలు పెట్టాడు. గర్భాన్ని కూడా పోగొట్టాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ షాను  తన భర్త శివం ఉజ్వాల్ ,  అత్తమామలపై తీవ్రమైన ఆరోపణలతో మురాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె భర్త, 28 ఏళ్ల ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, బాలీవుడ్ నటి నోరా ఫతేహీలా కనిపించాలని ఆమెను బలవంతంగా రోజూ మూడు గంటలు వ్యాయామం చేయించాడని, ఆమె అందాన్ని తిరస్కరిస్తూ శారీరక, మానసిక,   భావోద్వేగ హింసకు గురిచేశాడని ఆరోపించింది.  ఈ కేసు గురించి బయటకు తెలియగానే అందరూ షాక్ కు గురయ్యారు.   

షాను ,  శివం ఉజ్వాల్‌కు మార్చిలోనే  ఘజియాబాద్‌లో పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగింది.  షాను కుటుంబం వివాహానికి దాదాపు రూ. 76 లక్షలు ఖర్చు చేసింది. ఇందులో రూ.  16 లక్షల విలువైన ఆభరణాలు, రూ.24 లక్షల మహీంద్రా స్కార్పియో వాహనం, రూ. 10 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు.  వివాహం తర్వాత షాను తన భర్త , అత్తమామల నుంచి తీవ్రమైన హింసను ఎదుర్కొంది. భర్త కూడా ఆమె అందాన్ని ఎగతాళి చేసేవాడు. తన జీవితం నాశనమైందని, నోరా ఫతేహీ వంటి అందమైన మహిళను పెళ్లి చేసుకునేవాడినని దెప్పిపొడిచేవాడు. 

 నోరా ఫతేహీ వంటి శరీరాకృతి కోసం ఆమెను రోజుకు మూడు గంటలు వ్యాయామం చేయమని బలవంతం చేశారు. ఆమె అలసట , ఆరోగ్య సమస్యల కారణంగా వ్యాయామం చేయలేనప్పుడు అన్నం పెట్టేవారు కాదు.  షాను గర్భవతి అని తెలిసినప్పటికీ, ఆమె అత్తమామలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు.  ఆమె భర్త శివం ఆమెకు తెలియకుండా అబార్షన్ పిల్ ఇచ్చాడని, దీని వల్ల తీవ్ర రక్తస్రావం , నొప్పి కారణంగా గర్భస్రావం జరిగింది.  ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యులు గర్భస్రావాన్ని నిర్ధారించారు. దీంతో ఇక భరించలేమని పోలీసులకు ఫిర్యాదుచేసింది.  

 షాను కుటుంబం ఇప్పటికే భారీ మొత్తంలో వరకట్నం ఇచ్చినప్పటికీ, శివం ,  అతని తల్లిదండ్రులు మరింత నగదు, ఆభరణాలు, భూమి, మరియు ఖరీదైన బట్టలు తీసుకురావాలని ఒత్తిడి చేశారు. ఓ సారి పుట్టింటికి వెళ్లి తిరిగి వస్తే ఇంట్లోకి రానివ్వలేదు.  ఆమె ఆభరణాలు  ఇవ్వడానికి నిరాకరించారు. చివరికి షాను మురాద్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు  చేసింది. ఆమె చేసిన ఆరోపణలు సంచలనం కావడంతో ఆ శివం కుటుంబం పరువు రోడ్డున పడింది.