YSRCP support the NDA Jagan Blunder : రాజకీయాల్లో ప్రత్యర్థి ఎవరో తెలుసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన ప్రత్యర్థి ఎవరో తేల్చుకోలేకపోతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న కూటమికి ఢిల్లీలో మద్దతు పలికారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తామని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. నెంబర్ గేమ్ ఉండొద్దన్నది తమ విధానమని అందుకే గతంలో ప్రణబ్ ముఖర్జీకి కూడా మద్దతిచ్చామని ఇప్పుడు బీజేపీకి మద్దతిస్తామని ప్రకటించారు. బొత్స ప్రకటన వైసీపీ వర్గాలను సైతం తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు.

జగన్ ను ఓడించిన ఎన్డీఏ

గత ఎన్నికల్లో జగన్ ఎవరి చేతిలో ఓడిపోయారు ?.  ఎన్డీఏ చేతిలో ఓడిపోయారు. బీజేపీ నేతలు రాష్ట్రానికి వచ్చి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు చేశారు. చివరికి మూడు పార్టీల కూటమి ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఓడించింది. అయినా ఇప్పుడు ఎన్డీఏకే ఢిల్లీలో మద్దతు ప్రకటించారు. 

ఎప్పటికీ బీజేపీతో కలవలేని రాజకీయ సమీకరణాలు

పోనీ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా బీజేపీతో పొత్తులు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా అంటే  అలాంటి చాన్సే లేదని రాజకీయ సమీకరణాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. జగన్ మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు దళితులు, ముస్లింలు.. అంటే పూర్తిగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్.ఆయన బీజేపీతో పొత్తులు పెట్టుకున్న మరుక్షణం ఆయన ఓటు బ్యాంక్ ఆయనకు దూరమైపోతుంది. అది రాజకీయంగా ఆత్మహత్యాసదృశం అవుతుంది. అందుకే గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తులు పెట్టుకోకుండా ఉండేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ పట్టించుకోలేదని చెబుతారు. ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేనప్పుడు.. ఇప్పుడు మద్దతు ఇవ్వడం ఎందుకన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. 

కేసుల భయంతోనేన్న విమర్శలు

జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నారు. ఆయనపై ఉన్న సీబీఐ కేసులకు తోడు లిక్కర్ స్కాం సహా పలు కేసులు మెడకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతి ఇస్తే..అది కూడా ఆయనకు చిక్కులు తెచ్చి పెడుతుదంని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన బీజేపీకి మద్దతు పలకడం.. పూర్తిగా భయంతోనేనని.. కేసుల భయంతోనేనని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. 

జాతీయ స్థాయిలోనూ ఒంటరి !

ఎంత ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ స్థాయిలో ఓ వ్యూహం ఉండాలి. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ తమ పార్టీ వారిపై దాడులు జరుగుతున్నాయని ఢిల్లీలో ధర్నా చేశారు.  ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇండీ కూటమి నేతలంతా వచ్చి సపోర్టు చేశారు. ఇక జగన్ తమ కూటమితో కలిసి వస్తారని వారు అనుకున్నారు. కానీ జగన్ మాత్రం వారి నమ్మకాన్ని వమ్ము చేశారు. తమను ఓడించిన బీజేపీకే మద్దతుగా ఉండటంతో ఇక వారు జగన్ ను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు జగన్ ఢిల్లీకి వెళ్లి ఏపీలో ఏదో జరుగుతోందని చెప్పుకుందామన్నా ఎవరూ వినేవారు లేరు. ప్రచారం జరుగుతున్నట్లుగా లిక్కర్ స్కాంలో ఆయనను అరెస్టు చేస్తే.. ఖండించేందుకు ఒక్క జాతీయ స్థాయి నాయకుడు కూడా సిద్దం కాకపోవచ్చు. జగన్ బీజేపీకి భయపడి చేస్తున్న రాజకీయాల వల్ల ఆయన పూర్తి స్థాయిలో రాజకీయంగా నష్టపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.