Andhra Pradesh Cabinet Decisions:  అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు  ఆమోదం లభించింది.  జలవనరులశాఖ పనులకు సంబంధించి మరో 11అంశాలకు ఆమోదం తెలిపారు. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలు,  సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్పునకు నాలా చట్ట సవరణలకు ఆమోదం లభించింది. అలాగే  51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలు, రాజధాని పరిధి 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతులు,  సీఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూకేటాయింపునకు ఆమోదం లభించింది.  

2025–2030 కాలానికి ఆంధ్రప్రదేశ్ సర్క్యూలర్ ఎకానమీ ,  వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానాన్ని అధికారికంగా ఆమోదించింది. ఈ విధానం ద్వారా  చెత్త నుండి సంపద సృష్టించే  ఎం.ఎస్.ఎం.ఇ.ల స్థాపనకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కలుగనున్నాయి.  A.P. టూరిజం భూమి కేటాయింపు విధానం 2024-29కు అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దరఖాస్తుదారుడు అంచనా వేసిన ప్రాజెక్ట్ వ్యయంలో కనిష్టం 50% నెట్ వర్త్ కలిగి ఉండాలి, పేరెంట్ కంపెనీ 76% షేర్‌హోల్డింగ్ కలిగి ఉండాలి, కన్సార్టియంలో గరిష్టంగా ముగ్గురు సభ్యులే ఉండాలి, లీడ్ మెంబర్ 51% మరియు మిగిలిన ఇద్దరు సభ్యులు కనిష్టం 20% వాటా కలిగి ఉండాలి అని నిర్దేశించారు.  

అధికార భాషా కమిషన్ పేరును “మండలి వెంకట కృష్ణరావు అధికార భాషా కమిషన్” గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి (వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పు) చట్టం, 2006 (NALA చట్టం) రద్దు చేసే నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు చట్టం, 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం, 2014, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం, 1920 & ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీలు చట్టం, 1965లకు కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

  అమరావతి నిర్మాణ పనులు వేగవంతమయ్యేందుకు, మౌలిక వసతుల కల్పన త్వరితగతిన చేపట్టేందుకు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. CRDA ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపు సమీక్షకు సంబంధించి మంత్రివర్గ బృందం 19వ సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు, అమరావతి భూమి కేటాయింపు నియమాలు, 2017 మరియు అమరావతి లాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ 2017 నిబంధనలకు అనుగుణంగా మంత్రివర్గ బృంద సిఫార్సుల ప్రకారం APCRDA కమిషనర్‌ అవసరమైన చర్యలు తీసుకునేలా అనుమతించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.  SRM, VIT విద్యా సంస్థల విస్తరణకు ఒక్కొక్క విద్యా సంస్థలకు అదనంగా మరో 100 ఎకరాల చొప్పును ఇవ్వనున్నారు.     మాన్యూవల్ స్కావెంజర్స్ మరియు డ్రై లేట్రిన్‌ల శుభ్రం చేసేవారి ఉపాధి,  నిర్మాణం (నిషేధం) చట్టం, 1993 ”ను రద్దు చేసే తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ముందు ఉంచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ చట్టం వల్ల (“మాన్యూవల్ స్కావెంజర్స్ నియమకాన్ని నిషేధించడం మరియు వారి పునరావాస చట్టం, 2013”),  ఇటువంటి పద్ధతులలో నిమగ్నమైన వ్యక్తులను విముక్తి చేయడానికి పునరావాస చర్యలను అందిస్తుంది.     

అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి మైనేనికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.  చంద్రయ్య కుమారుడు T.వీరంజినేయులకు  జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే  ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గుంటూరులో తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి 2954 చదరపు గజాల మునిసిపల్ భూమిని  99 సంవత్సరాల వరకు పొడిగింపు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తూ అద్దెకు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.