AP Liquor Scam Raj Kesireddy Assests: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది.  ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు (ఏ1) కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి) పేరిట రూ. 13 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆగస్టు 21, 2025న ఈ ఆదేశాలు జారీ చేశారు. సిట్ అధికారులు ఈ ఆస్తులను కసిరెడ్డి , అతని బంధువుల పేర్లపై కొనుగోలు చేసినట్లు గుర్తించారు.సిట్ దర్యాప్తులో కసిరెడ్డి విదేశీ పర్యటనలు, హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్తుల కొనుగోళ్లతో లగ్జరీ జీవనశైలిని గుర్తించారు.   జులై 30, 2025న హైదరాబాద్ సమీపంలోని ఒక ఫామ్‌హౌస్ నుంచి రూ. 11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు, ఇది నిందితుడు పురుషోత్తం వరుణ్ కుమార్ (ఏ-40) ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నగదు స్వాధీనం చేసుకున్నారు.                          

లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  మద్యం కుంభకోణం సుమారు రూ. 3,200 కోట్ల విలువైనదని సిట్ వర్గాలు చార్జిషీట్‌లో చెప్పాయి.  వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రముఖ మద్యం బ్రాండ్లను తొలగించి, లంచాలకు బదులుగా నాసిరకం  మద్యాన్ని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్  ద్వారా మద్యం విక్రయాలు నగదు రూపంలో జరిగాయి, డిజిటల్ లావాదేవీలు కాకుండా. ఈ నాసిరకం మద్యం వల్ల వేలాది మంది మరణించారని, లక్షలాది మంది అనారోగ్యానికి గురయ్యారని ఆరోపణలు ఉన్నాయి.                                 

 2024 ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు.  జగన్ మాజీ ఐటీ సలహాదారుడు రాజ్ కసిరెడ్డిని ప్రధాన నిందితుడిగా గుర్తించి ఏప్రిల్ 21న హైదరాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అలాగే  ధనుంజయరెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో సహా  పలువుర్ని అరెస్టు చేశారు.  మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ కుంభకోణం వెనుక రాజ్ కసిరెడ్డి ఒక్కడే కీలకమని మీడియా ఎదుట  చెప్పారు. 

లిక్కర్ స్కామ్‌లో నిందితులు పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించి ఆస్తులు కొన్నట్లుగా గుర్తించారు. చట్ట ప్రకారం.. స్కాముల ఆదాయంతో  సంపాదించిన ఆస్తులను జప్తు చేయవచ్చు. అందుకే లిక్కర్ స్కామ్‌తో  సంపాదించిన డబ్బులతోనే ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా తేలిన వాటిని జప్తు చేస్తున్నారు. ఇతర నిందితుల ఆస్తులను కూడా జప్తు చేయనున్నారు.  పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించిన వాటిని వైట్ చేసుకునేందుకు.. సూట్ కేసు కంపెనీలను పెట్టారని సిట్ అధికారులు గుర్తించారు.  ఇప్పుడు ఆ లావాదేవీలన్నింటినీ బయటకు తీస్తున్నారు