Hyderabad News: హైదరాబాద్ లో రౌడీషీటర్లు మరోసారి రెచ్చిపోయారు. పిస్తాహౌస్(Pistha house) లో భోజనం చేస్తున్న కస్టమర్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. 17 మంది రౌడీముఠా ఒక్కసారి వచ్చిన కస్టమర్లపై దాడి చేయడమేగాక...హోటల్ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో మిగిలిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది.
పిస్తాహౌజ్ లో బీభత్సం
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఉప్పరపల్లి(Upparapalli) పిస్తాహౌస్ శనివారం వీకెండ్ కావడంతో కస్టమర్లతో కిటకిటలాడుతోంది. ఫ్యామిలీలతో భోజనం చేసేందుకు వచ్చిన వారు కూర్చుని సరదా మాట్లాడుకుంటూ తింటుండంగా ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు కానీ.. ఓ 17 మంది అల్లరి మూక వచ్చి రచ్చ రచ్చ చేసింది. రావడంతోనే భోజనం చేస్తున్న కస్టమర్లపై విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా కస్టమర్లను కొడుతూ , హోటల్ లో ఫర్నీచర్ విసిరేస్తూ బీభత్సం సృష్టించారు.
దీంతో భోజనం చేస్తున్న వారంతా బెంబేలెత్తి పిస్తా హౌస్ నుంచి బయటకు పరుగులు తీశారు. అంతటితో ఆగని రౌడీమూక...హోటల్ ముందు పార్కు చేసిన బైక్ లు ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కొన్నేళ్లుగా హైదరాబాద్ పోలీసు(Hyderabad Police)లు శాంతిభద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకోవడంతో కొంతకాలంగా రౌడీమూకల అల్లర్లు తగ్గాయి. ఇటీవల జరిగిన సమీక్షలోనూ సీఎం రేవంత్ రెడ్డి శాంతిభద్రతల విషయంలో ఉపేక్షించొద్దని హెచ్చరించారు. కానీ తాజాగా జరిగిన దాడిపై పిస్తాహౌస్(Pistha House) యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.