UKG Student Died: హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. హోం వర్క్ రాయలేదని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థిని టీచర్ కొట్టడంతో చిన్నారి మరణించాడు. వివరాలు... రామంతపూర్ వివేక్ నగర్​లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో హేమంత్ అనే విద్యార్థి యూకేజీ చదువుతున్నాడు. శనివారం హోమ్ వర్క్ చేయకుండా పాఠశాలకు వెళ్లాడు. దీంతో టీచర్ బాలుడి తలపై పలకతో కొట్టింది. దీంతో హేమంత్ స్పృహ తప్పి పడిపోయాడు. పాఠశాల యాజమాన్యం వెంటనే హేమంత్‌​ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 


అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం హేమంత్ మృతి చెందాడు. సోమవారం హేమంత్ మృతదేహంతో‌.. పాఠశాల ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన యాజమాన్యం న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం వారు వనపర్తికి తరలించారు. గత కొంత కాలంగా హేమంత్​ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చుట్టుపక్కల వారు చర్చించుకుంటున్నారు.


చాక్లెట్ల కోసం వెళ్లి కరెంట్ షాక్‌తో చిన్నారి మృతి
నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో మరో విషాదం జరిగింది. చాకెట్ల కోసం వెళ్లి ప్రిడ్జి డోర్ ఓపెన్ చేసిన చిన్నారి కరెంట్ షాక్‌కు గురై మృత్యువాత పడింది. నవీపేటకు చెందిన రాజశేఖర్ తన నాలుగేళ్ల కూతురు రితీషతో కలిసి ఓ సూపర్ మార్కెట్ వెళ్లారు. తండ్రి రాజశేఖర్ ఒక ఫ్రిడ్జ్ లో తనకు కావాల్సిన వాటి కోసం చూస్తున్న సమయంలోనే నాలుగేళ్ల రితీష.. పక్కనే ఉన్న మరో ఫ్రిడ్జ్ లో చాక్లెట్ల కోసం ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది. అంతలో రుషితకు షాక్ తగలడంతో కదలకుండా అలాగే ఉండిపోయింది.


చడీచప్పుడు కాకుండా ఉండిపోవడంతో.. పక్కనే ఉన్న తండ్రి కూడా వెంటనే స్పందించలేదు. తన పని పూర్తి చేసుకుని రితీషను గమనించి వెంటనే తనను లాగాడు. పాప స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆ చిన్నారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉందని నందిపేట వైద్యులు చెప్పడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లేలోగా పాప మరణించిందని బంధువులు తెలిపారు.