Ujjain Crime News: 


మధ్యప్రదేశ్‌లో దారుణం..


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సామూహిక అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక రోడ్డుపై అర్ధనగ్నంగా నడుచుకుంటూ వచ్చిన దృశ్యాలు అక్కడి CC కెమెరాలో రికార్డ్ అవడం సంచలనమైంది. చాలా దారుణమైన స్థితిలో ఉన్న ఆ బాలిక రోడ్డుపై నడుచుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ సాయం కోసం అభ్యర్థించడం కలిచివేసింది. ఆమెను అలాంటి స్థితిలో చూసినా ఎవరూ సాయం చేయలేదు. ఓ వ్యక్తి ఆమెని చూసి కూడా పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళ్లిపోవడం CC కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియోలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఉజ్జెయిన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నాగర్ రోడ్‌ వద్ద ఈ ఘటన జరిగింది. తన ఒంటిని కప్పుకునేందుకు నానా ఇబ్బందులు పడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోయింది. చివరకు ఓ ఆశ్రమం వద్దకు చేరుకుంది. ఆమెని చూసిన ఓ పూజారి వెంటనే ఆమె శరీరాన్ని కప్పాడు. ఆమెపై అత్యాచారం జరిగిందని గుర్తించాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు అత్యాచారం జరిగినట్టు ధ్రువీకరించారు. గాయాలు చాలా తీవ్రంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కి తరలించారు. అప్పటికే చాలా రక్తం పోయింది. పోలీసులే ముందుకొచ్చి ఆమెకి రక్తదానం చేశారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు అందించలేదు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.


"ఆ బాలికకు వైద్య పరీక్షలు చేయించాం. అత్యాచారానికి గురైనట్టు వైద్యులు నిర్ధరించారు. ఈ కేసుని విచారించేందుకు స్పెషల్ సిట్‌ని వేశాం. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నాం. ఎవరికి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు చెప్పాలని ప్రజల్ని కోరుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ బాలిక సరిగ్గా చెప్పలేకపోతోంది. ఆమె మాట్లాడిన భాషని బట్టి చూస్తే యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కి చెందినట్టుగా అనిపిస్తోంది"


- పోలీసులు 


మధ్యప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాల ఘటనలు పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రలోనూ ఇవే పరిస్థితులున్నాయి. 2019-21 మధ్య కాలంలో అదృశ్యమైన బాలికలు, మహిళల సంఖ్య పెరిగింది. NCRB లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్‌లోనే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి.